యీ కవితా వైజయంతిలో పంచభూతాలు, సూర్యచంద్రులు, యజమానుడు అనే ప్రత్యక్షశివమూర్తులు ఎనిమిదీ కానవస్తున్నాయి. దానికి నిదర్శనంగా మొట్టమొదటి అంశమే ఆకాశం. ఆకాశం పరమాత్మ ప్రథమావిర్భావం కనుక పరమాత్మలాగా సర్వవ్యాపి. కానీ ఆకాశం అనగానే మనం తలయెత్తి పైకి చూస్తాం. ఆకాశం కనబడదు కానీ లోక బాంధవుడు, కర్మసాక్షి, ఆదిత్యుడు, ప్రభాకరుడు అయిన సూర్యభగవానుడు కనిపిస్తాడు. ఆయనను చూడటం అంటే శ్రీమన్నారాయణమూర్తిని దర్శించటమే. మరక కుండలవంతుడు, హరి, హిరణ్మయవపువు అయిన శ్రీమన్నారాయణుడు సవితృమండల మధ్యవర్తి అయి ధ్యేయుడుగా ఎల్లకాలాలలో ఉన్నాడు అని ఋషులు స్వయంగా దర్శించి చెబుతున్నారు. తరువాత 'చందమామ', అటు తరువాత కొంత ముందుకు పోగా 'జాబిల్లి' కూడా అమృతకిరణాలతో మనకు దర్శన మిస్తున్నారు. తరువాతి శీర్షిక గాలి, ఇది పంచభూతాలలో రెండవది. ప్రధాన ప్రాణశక్తి. వెనువెంటనరే 'మేఘుడు'. మేఘుడు అంటే జీవనదాత. అటుపై 'భూతధాత్రి'. నేల తల్లి. 'మానససరోవరం'లో జలభూతం మనకు గోచరిస్తుంది. మేఘుడు విద్యుత్ప్రభలతో అలరారుతూ ఉంటాడు కనుక అగ్నితత్త్వాన్ని అందులో అనుసంధించుకుంటే 'అష్టమూర్తుల విన్యాసం' ఈ వైజయంతిలో అద్భుతంగా నెలకొని ఉన్నది. తరువాతి అశ్వయుజపౌర్ణమి, ఉగాది, రౌద్రి మొదలైనవి. కాలాత్మక పరమేశ్వర సంకేతాలు. ''మహాత్మా'' అనే శీర్షిక మొదలుకొని అరవైయవ శీర్షిక ద్వారా ఉన్నవన్నీ నా దృష్టిలో యజమానాత్మక అష్టమతనువునకు సంబంధించినవి. ఈ విధంగా ఈ 'కవితా వైజయంతి' పరమేశ్వరుని అష్టమూర్త్యాత్మక స్వరూప దర్శనం పాఠకులకు కలిగిస్తున్న ఒక ఆధునిక ఉపనిషత్తుగా నా స్ఫురణలో కదలాడుతూ 'ఉంటుంది'. - ప్రాచార్య శలాక రఘునాథ శర్మ
శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good