ముందు కథ పుట్టింది ఈ గడ్డ మీదనే! ఇక్కడే! భారతదేశంలోనే కథ పుట్టింది. ఇక్కడ పుట్టి పెరిగిన కథనే ప్రపంచవ్యాప్తంగా అంతా అక్కున చేర్చుకున్నారు. భారత రామాయణాల తర్వాత 'బృహత్కథ'నే ప్రముఖంగా చెప్పుకుంటారు. దీనిని గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృత భాషలో రచిస్తే, 'కథాకత్రయం' బుధస్వామి, సోమదేవుడు, క్షేమేంద్రుడు దానిని సంస్కృతంలోనికి అనువదించారు. కాశ్మీర ప్రభువు అనంతదేవుని భార్య సూర్యమతి కోసం సోమదేవుడు 'కథాసరిత్సాగరం'  సృష్టించాడు.

    ఈ కథల్ని ముందు పార్వతికి శివుడు చెప్పాడు. అతను చెబుతోంటే చాటు నుండి ఈ కథల్ని పార్వతితో పాటుగా శివుని అనుచరులు విన్నారు. విన్న పాపానికి వారంతా భూలోకంలో మానవులుగా జన్మించారు. జన్మించి తాము విన్న కథల్ని అందరికి చెప్పి ముక్తి పొందారు. ఆ నోటా ఈ నోటా కథలన్నీ కదిలి ఇప్పుడు మీ ముందు ఇలా పుస్తక రూపాన్ని ధరించాయి.

    ఇందులో ప్రేమ కథలు ఉన్నాయి. వీరుల కథలు ఉన్నాయి. హాస్య-చమత్కారాలు ఉన్నాయి. అద్భుత కృత్యాలు, భయానక దృశ్యాలు, సాహస కార్యాలు, సముద్ర ప్రయాణాలు, గగన విహారాలు, యంత్రమయ పట్టణాలు, మహా పాపాలు....ఎన్నెన్నో ఉన్నాయి. జంతువులు మాట్లాడుకునే పంచతంత్ర కథలూ, విక్రమార్కునికి బేతాళుడు చెప్పినటువంటి కథలు కూడా ఇందులో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ కథా సాహిత్యం అంతా ఇందులో నిక్షిప్తమై ఉంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good