గిఖోర్
రైతు హంబో యింట్లో ఆనాడు భేదాభిప్రాయం వచ్చింది. తన పన్నెండేళ్ల కొడుకు గిఖోర్ను పట్నానికి తీసుకువెళ్ళి పనిలో పెడితే ప్రపంచంలో యెలాగో నెట్టుకొస్తాడు అనుకున్నాడు హంబో. కాని అతని భార్య మాత్రం ఒప్పుకోవడం లేదు.
''ముక్కుపచ్చలారని బిడ్డని నీతీ, న్యాయం లేని యీ ప్రపంచంలో తోసెయ్యడానికి వీల్లేద''ని ఆ తల్లి ఒకటే ఏడుపు, కాని హంబో ఆమెను లెక్కచేయలేదు.
ఒక విచారకరమైన ఉదయాన, గిఖోర్ కుటుంబమూ, ఇరుగు పొరుగువారూ గిఖోర్ని పల్లెచివరి వరకూ తీసుకువెళ్ళి, అక్కడనుంచి పట్నానికి వాడిని సాగనంపారు. అతని చెల్లెలు జాన్నీ ఏడుస్తూనే వుంది. చిన్న గల్లో ముద్దు మాటలతో
''ఒలేయి గిఖోరూ, ఎక్కలి కెలుతున్నావు?'' అని కేక వేశాడు.
గిఖోర్ వెనక్కి చూస్తూ నడుస్తున్నాడు. వాళ్ళంతా యింకా పల్లె పొలిమేరలో నిలుచునే వున్నారు. వాళ్ళమ్మ తన పని చేసుకునే తుండు గుడ్డతో కళ్ళు తుడుచుకుంటోంది. తండ్రి పక్కన పరుగెత్తినట్లుగా గిఖోర్ నడుస్తున్నాడు. మరోసారి గిఖోర్ తిరిగి చూసే సరికి, అప్పటికే కొండ వెనక్కి నక్కింది వాళ్ళ ఊరు.
ఆ పైన గిఖోర్ నడకలో వెనుకపడిపోయాడు.
''రా! బాబూ! గిఖోర్! నడు...వచ్చేశాం...యిక అట్టే దూరం లేదు! అని పిలుస్తూ హంబో ముందుకి పోతున్నాడు. హంబో చేతిలో ఉన్న సంచిలో రొట్టె, జున్ను, కొన్ని పొగాకు పాయలూ వున్నాయి.
సాయంత్రానికి పర్వతాల వెనకాలకి వాళ్ళు మళ్ళిన తరువాత, తిరిగి మరోసారి వాళ్ళ గ్రామం కనిపించింది.
''అది మనిల్లేకదూ నాన్న! అవునా?'' అన్నాడు గిఖోర్ పల్లె కేసి చూపిస్తూ కాని వాళ్ళ యిల్లు అసలు కనబడడమే లేదు.
ఆ రాత్రికి వాళ్ళు ఓ ఊళ్ళో హంబో పాత స్నేహితుడుంటే అతనింట్లో దిగారు. కూర్చునే పరుపుల మంచానికి ఒక మూల టీ తయారు చేసుకునే సమొవారు (నీళ్ళు మరగించి టీ తయారు చేసేందుకు రష్యాలో వాడుకొనే పాత్ర). పొగలు చిమ్ముతోంది. గ్లాసులు గలగల్లాడిస్తూ కడిగి, ఒక చిన్నమ్మాయి ఈ తయారు చేస్తోంది. ఆమె అందమైన ఎర్రని దుస్తులు వేసుకుంది. పట్నంలో పనిచేసి కొంచెం డబ్బు సంపాదించాక అటువంటి దుస్తులు జాన్నీకి కొనిపెట్టాలని గిఖోర్ లెక్కవేశాడు...
Rs.60.00
In Stock
-
+