అత్యంత సాధారణ భాష, భావజాలంతో ఒక క్రమగతిలో సాగే ఈ పదహారు కథల 'కథలగూడు'లో రచయిత దేవులపల్లి కృష్ణమూర్తి నింపాదిగా, స్థిమితంగా ఉండుండీ జీవితం మారుమూలల్లో దాగిన మానవీయ అంశాలపై అసాధారణ శక్తిగల సెర్చిలైటు వేసి, మస్తిష్కంలో వెలుగులు వెలిగిస్తాడు. ఆయా పాత్రల నిరాడంబరత్వాన్ని సాధారణమైన భాషలో పలికిస్తూ మెరుపులు మెరిపిస్తాడు.

డెబ్బై ఏళ్ళ జీవితంలో తనను వెంటాడిన జ్ఞాపకాలను, మధ్యతరగతి బతుకు వెతలను- ఒక బైరాగి తత్త్వాలను గానం చేసినట్టు కథలుగా పాడి పాఠకులకు వినిపిస్తాడు. ఒక దశలో రచయిత మాయమయ్యి ఒట్టి కథ పాఠకుడిలో అనుభూతై ధ్వనిస్తుంది. కథానంతర వ్యథ పాఠకుడి అంతరంగంలో మిగిలిపోతుంది. విస్తృతమైన రచయిత జీవితానుభవం ఈ కథలగూటిని అల్లే క్రమంలో ఒక మార్మికమైన శైలిని సాధించింది. ఆ శైలే పాఠకుణ్ణి ఈ కథలను చివరిదాకా చదివిస్తుంది. రచయితను సమూహ రచయితల నుంచి విడదీసి విభిన్నంగా నిలబెడుతుంది.

కృష్ణమూర్తి కథలు రెండు, మూడు దశాబ్దాల కాలపు వ్యక్తులనూ, సంఘటనలనూ పాఠకులకు పరిచయం చేస్తాయి. కొన్ని కథల్లో మాత్రం రచయిత వృత్తి అయిన రెవెన్యూ తత్త్వం తొంగి చూసి వాటిని వ్యాసాల్లా మార్చాయి. మొత్తం మీద ఈ సంపుటిలోని కథలన్నీ రచయిత నాస్టాల్జిక్ అనుభూతుల రూపాంతరాలే. దాచేస్తే దాగని చరిత్రకు కథాకృతులే. క్షణక్షణమూ 'సత్యం' చేసుకుంటున్న ఆత్మహత్యకు ఒణికిపోతున్న మానవీయ విషాదాంతాలే.
కేవలం పాఠకులే కాదు, కొత్తగా కథలు రాసే రచయితలూ, పాత రచయితలూ... ముగ్గురూ చదవతగ్గ కథలివి. సంఘటనలను కథలుగా ఎలా మలచాలో చెప్పే గైడ్ ఈ కథల (వ్యథల) గూడు.

- డి. లెనిన్

Write a review

Note: HTML is not translated!
Bad           Good