ఈ కథలలో స్త్రీ-పురుష సంబంధాలను విశ్లేషించిన కథలు మూడున్నాయి. విప్లవ ఆదర్శాలు, లక్ష్యాల నెపంతో మగవాడు భార్యాబిడ్డల్ని వదిలిపెట్టి పోగలడు కానీ వంటరిదైన స్త్రీ బతుకీడ్చి పిల్లలను రేవుకు తేవడానికి ఎన్నో కష్టనష్టాలు భరించాల్సి వస్తుంది. అంతులేని సంఘర్షణ, కన్నకొడుకు వ్యతిరేకత- ఈ నేపథ్యంలో స్త్రీ తీసుకున్న కఠిన నిర్ణయాన్ని స్త్రీ కోణంలోంచే తెలియజేసిన కథ సావిత్రి.

ఆడపిల్ల ఎదుగుతున్న క్రమంలోని వివిధ దశల్లో మగవాళ్ల గురించిన ఆమె ఆలోచనలు, అభిప్రాయాలు, మోహాలు, విరహాలు, స్వేచ్ఛా తపనలను ఆవిష్కరించిన కథ తొమ్మిదో నెంబరు చంద్రుడు.

'మనుషులకి అన్నిరకాల స్వేచ్ఛలూ వుండాలి, అదే అంతిమ విలువ' అనే ఆధునిక భావన పునాదిగా స్త్రీ-పురుషుల సహజీవనం ఒక ట్రెండ్‌గా ఇప్పుడిప్పుడే మొదలైనా మన సమాజంలో ఇరువురికీ సమానంగా వర్తించే స్థాయికి ఆ భావన ఇంకా ఎదగలేదు. స్త్రీ మనోభావనలను, స్వేచ్ఛాపిపాసను స్త్రీ కోణంలోంచే హృద్యంగా వివరించిన కథ 'శతపత్ర సుందరి'.

దళితుల జీవితం ఇతివృత్తంగా కల కథలు మూడు వున్నాయి. 'చివరి చర్మకారుడూ లేడు...' కథలో ముసలి డానియేలు తర్వాతి తరంవారు-తమ్ముడు, అతని కొడుకులు-వేరే ఉపాధులు వెతుక్కుని మునుపటి నిమ్నస్థాయి నుండి పైకి ఎదిగిన వైనం కనపడితే, 'నేను తోలు మల్లయ్య కొడుకుని' కథలో పాత, చెప్పులు కుట్టే వృత్తిని వదులుకోలేక, మరో వృత్తి వెతుక్కోలేక సతమతమయ్యే మారయ్య గుంజాటన కనపడుతుంది.

ఇక మిగతా కథల గురించి. బడిపిల్లల ఎండాకాలం తాతిల్‌ (సెలవులు) మూడు తరాలవారికీ విశ్రాంతినిచ్చి శారీరకంగా, మానసికంగా సేదదీర్చే ఋతువు. ఈ సూక్ష్మం మన గ్రామీణ ప్రజలకు తెలుసు. గనుకనే వారి కుటుంబబంధాలు, మానవ సంబంధాలు గట్టివి అని తెలియజేసే కథ తాతిల్‌.

Pages : 205

Write a review

Note: HTML is not translated!
Bad           Good