భిన్న జీవిత చిత్రాల కలనేత...కథ 2013
ఎప్పటిఆగే ఈ ఏడాది కూడా 'కథ-2013' సంకలనం తనదైన ముద్రతో వచ్చింది. మంచి కథలకు మచ్చుతునకల్లాంటి 14 కథల కూర్పుతో ఆకట్టుకుంది. వర్తమాన జీవన సందర్భాలను కళ్ళకు కట్టించే ఇతివృత్తాలు, వాటిని కథలుగా మలిచిన భిన్న శైలీ విన్యాసాలు ఇందులో ప్రస్ఫూటంగా దర్శనమిస్తాయి. ఇదీ తెలుగు కథ అని చాటి చెప్పగల విలక్షణమైన మార్క్‌ ఉన్న కథలు ఈ సంకలనంలో మూడు ఉన్నాయి. ఒకటి సం.వెం.రమేష్‌ రాసిన 'సిడిమొయిలు', రెండోది తల్లావజ్జల పతంజలి శాస్త్రి రాసిన 'రామేశ్వరం కాకులు', మూడోది భగవంతంరాసిన 'చంద్రుడు గీసిన బొమ్మలు'. ఈ మూడు కథలు మనస్సును కుదిపేస్తాయి.

'సిడిమొయిలు' కథ స్వచ్ఛమైన తెలుగు నుడికారానికి ప్రతిబింబం. ¬సూరు సమీపంలోని అడవి అంచుల్లో ఉన్న మాదిగ పల్లెల జీవన సమరం. జానపదమూ-వర్తమాన జీవనపథమూ కలగలిసిన చిత్రపటం. ఈ కథ చదువుతున్నంతసేపూ అందులోనిసన్నివేశాలు కళ్ళముందు ఆవిష్కృతమవుతాయి. ఇక పతంజలి శాస్త్రి కథ చితికిన బతుకుల్లోని ఎగుడు దిగుళ్ళను చెబుతున్నట్టు కనిపిస్తుంది గానీ చివరికి పరమ తాత్వికంగా ముగుస్తుంది. ఒకానొక అరుదైన క్షణాలలో సంభవించే సంగమం అనేది జీవితానికి ఎలాంటి పరమార్థం చూపుతుందో 'రామేశ్వరం కాకులు' కథ చదివితే మనసుకి బోధపడుతుంది. ఘవంతం రాసిన 'చంద్రుడు గీసిన బొమ్మలు' కథలో మేజిక్‌, రియాలిటీతో పెనవేసుకుని అద్భుత చిత్రంగా మారిపోయింది. ఈ కథ గురించి చెప్పేకన్నా...చదవడమే మిన్న!

మిగతా కథల విషయానికొస్తే కె.వి.నరేంద్రర్‌ రాసిన 'గుట్ట' కథ ఆదరణ కోల్పోతున్న శిల్పకళాకారుల దీనస్ధితికి అద్దం పట్టింది. సహజంగా ఆయన కథల్లో కనిపించే కొసమెరుపు ఈ కథలోనూ ఒక విషాధఛాయలా అలుముకుని పాఠకుల్ని ఆలోచింపజేస్తుంది. పి.సత్యవతి రాసిన 'సప్తవర్ణ సమ్మిశ్రితం', విమల రాసిన 'నీలా వాళ్ళమ్మ మరికొందరు' కథలు స్త్రీల అంతరంగ సంఘర్షణని ప్రతిఫలించాయి. సంపన్న వర్గాల కుటుంబాలలోని వృద్ధుల కోసం తయారు చేయబడుతున్న కొత్త రకం డొమెస్టిక్‌ వర్కర్ల జీవితమే సత్యవతి సప్తవర్ణ సమ్మిశ్రితం కథకి ఇతివృత్తం. ఇక తరతరాలుగా మగ ప్రపంచపు పదఘట్టనల కింద నలిగి వసివాడిపోతున్న దయనీయ మహిళల పరంపరానుభవాన్ని 'నీలా వాళ్ళమ్మ మరికొందరు' కథలో విమల ఆర్ధ్రంగా చిత్రించారు.

తెలంగాణ బతుకుగాథల్ని అక్షరబద్ధం చేస్తున్న పెద్దింటి అశోక్‌కుమార్‌ 'ప్రాణం ఖరీదు వంద ఒంటెలు' కథలో మరోసారి తన పంథాని చాటుకున్నారు. పిడికెడు ముద్ద కోసం దేశం కాని దేశంలో గాయాల ముద్దలవుతున్న బడుగు బతుకుల జీవలయని ఆయన అద్భుతంగా (విషాదంగా అనాలేమో) పట్టి చూపించారు తన కథలో. పి.వి.సునీల్‌ కుమార్‌ రాసిన 'దెయ్యం', అనిల్‌ ఎస్‌.రాయల్‌ రాసిన 'రీబూట్‌' ఈ సంకలనంలోని మరో రెండు విలక్షణ కథలు. తెలుగులో సైన్స్‌ ఫిక్షన్‌ రావడం లేదు అని బెంగటిల్లే వారికి 'రీబూట్‌' కథ చక్కని హామీ! కుప్పిలి పద్మ, మధురాంతకం నరేంద్ర, సింధుమాధురి, కె.ఎన్‌.మల్లీశ్వరి, యాజీ కథలు కూడా దేనికదే వైవిధ్యంతో మెప్పిస్తాయి. పాఠకులు దృష్టి కోణాన్ని విశాలం చేస్తాయి. - ఒమ్మి రమేష్‌బాబు

Write a review

Note: HTML is not translated!
Bad           Good