ఒకతను వెళ్తూ ఓ చోట కొందరు రక్షక భటులు ఓ దొంగను చుట్టు ముట్టడం చూసాడు. మరికొంత దూరం వెళ్ళాక ఓ రాజు చుట్టూ కూడా ఉన్న కొంతమంది రక్షక భటుల్ని చూసాడు. అతను ఆగి రాజుని సందేహంగా అడిగాడు. ''రాజా! దొంగ చుట్టూ ఇలాగే రక్షక భటులున్నారు. మీ చుట్టూ కూడా రక్షక భటులున్నారు. ఆ దొంగకి, మీకూ గల తేడా ఏమిటీ?''

అందుకా రాజు నవ్వి జవాబు చెప్పాడు. ''తన చుట్టూ రక్షక భటులున్న ఆ దొంగ బంధితుడు. అతను పారిపోకుండా వాళ్ళు కాపలా ఉన్నారు. నేను స్వేచ్ఛ కల వాడిని. ఈ రక్షక భటులు నన్ను కాపాడటానికీ వీరంతా నా చుట్టూ ఉన్నారు. నేను వెళ్ళిపొమ్మంటే వెళ్ళిపోతారు''.

ఆ రక్షక భటులు కర్మలు. దొంగ చుట్టూ పారిపోకుండా ఉండి అతని నేరాలకి తగిన శిక్ష పడేలా చేసే రక్షక భటులు స్వార్ధకర్మల్లాంటి వాళ్ళు. స్వార్ధ కర్మలు మనల్ని బంధిస్తాయి. కాని రాజు చుట్టూ ఉన్న రక్షక భటులు నిస్వార్ధకర్మల్లాంటి వారు. నిస్వార్ధ కర్మలు మనిషిని రక్షిస్తాయి తప్ప బంధించలేవు.

త్వరగా పెరిగే ఓ లత, ఓ కొబ్బరి చెట్టు కాండాన్ని అల్లుకుని ఆ కొబ్బరి చెట్టుతో గర్వంగా చెప్పింది.

''చూడు, నేను ఎంత త్వరగా పెరిగి నిన్నంతా అల్లుకున్నానో? మరి నువ్వో? ఓ అంగుళం కూడా పెరగలేదు.''

ఆ కొబ్బరి చెట్టు చిన్నగా నవ్వి జవాబు చెప్పింది. ''వేలకొద్దీ లతలు నాతో ఇదే మాటన్నాయి. గాలి తాకిడికి అవి వెళ్ళిపోయాయి నేను మాత్రం బలంగా ఇక్కడే ఉన్నాను''.

హిందూ సనాతన ధర్మం ఆ కొబ్బరి చెట్టులాంటిది. అలాంటి హిందూ మతానికి మూలస్ధంబాలైన కర్మ-జన్మల గురించి విరించే పుస్తకం ఇది. కర్మంటే ఏమిటీ? కర్మ ఫలం ఎప్పుడు ఎలా లభిస్తుంది? ఏది కర్మ బంధాన్ని కలిగిస్తుంది. కర్మ ఫలం అనుభవించకుండా దాన్ని ముందుగానే నాశనం చేసుకోవడం ఎలా? ఇలాంటి ఎన్నో విశేషాలను శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తిగారు వివరించిన ఈ పుస్తకంలో చదవచ్చు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good