విూ జ్ఞాపకశక్తిని బేరీజు వేసుకోండి!
ఎలా గుర్తుంచుకుంటాము?
ఎలా మర్చిపోతాము?
అసలు మన జ్ఞాపకశక్తి ఎంత?
జ్ఞాపకాలు
జ్ఞాపకం అంటే...
రెక్క విప్పిన వ్యాపకానికి గూడూ నీడా జ్ఞాపకమే!
జ్ఞాపకం లేకపోతే నేర్చుకునేది సున్నా!
చదువు ద్వారా, అనుభవం ద్వారా, మనం నేర్చుకునే జ్ఞానమంతా మెదడులో జ్ఞాపకాల రూపంలో నిక్షిప్తమై వుంటుంది. అలా జ్ఞాపకాలలో ఉంచుకోలేకపోతే మనం నేర్చుకునేది సున్నా అవుతుంది.
ఒక మనిషితో మనం సంభాషించాలంటే మనం చెప్పదల్చుకున్న ఆలోచనలు గుర్తుండాలి. అంతకుముందు అతను మనతో ఏమి మాట్లాడాడో గుర్తుండాలి. ఈ గుర్తుండటమనేది జ్ఞాపకశక్తి ద్వారానే సాధ్యమవుతుంది. మరో మాటలో చెప్పాలంటే - సేకరించుకున్న సమాచారాన్ని మెదడులో నిక్షిప్తం చేసి అవసరమైనప్పుడు వెలికి తీసి వాడుకోగలిగే శక్తి - జ్ఞాపకం!
జ్ఞాపకం అనేది లేకపోతే మనకు ఆలోచించటం చేతకాదు. అప్పుడు ఆలోచనల్ని వ్యక్తం చేసేందుకు భాషా మిగలదు. మన అస్థిత్వమే సున్నా అవుతుంది.
క్లుప్తంగా చెప్పాలంటే జ్ఞాపకం అనేది లేకపోతే మనకూ కాయగూరలకూ తేడా వుండదు. మనకూ చెట్టూ చేమలకూ తేడా వుండదు. మేధాపరంగా మనం మృతులం.
జ్ఞాపకం అనేది మన శరీరంలో వుండే గుండెకాయలా, లివరులా, చిన్న ప్రేవుల్లా, పెద్ద ప్రేవుల్లా ఒక చర్యకు మాత్రమే పరిమితం కాదు. అనేకానేక సంక్లిష్ట కలాపాలతో కూడుకుని ఉండి రకరకాల ప్రేరణలకు రకరకాల విధాలుగా స్పందిస్తుంటుంది. అయితే మొత్తం మీద జరిగే ఫలితం మాత్రం ఒకటే -
భవిష్యత్తులో ఉపయోగించుకోవటానికి వీలుగా సమాచారాన్ని నిలవ చేసుకోవటం!
ఒక్క ముక్కలో చెప్పాలంటే మనలో వున్నది ఒక్క జ్ఞాపకం కాదు, అనేక జ్ఞాపకాలున్నాయి. ఒక మనిషి తన జ్ఞాపకశక్తిని కోల్పోయాడంటే దాని అర్థం అతనికి వున్న అనేకానేక జ్ఞాపక శక్తులలో కొన్ని శక్తులు పనిచేయటం లేదన్నమాట. అన్ని జ్ఞాపకశక్తుల్ని కోల్పోయాడంటే మాత్రం స్పృహ కోల్పోయినట్లే లెక్క. బహుశా చనిపోవచ్చు కూడా.