కలి ఎవరు? అతను ఎక్కడ పుట్టాడు? అతడు జగత్తును నియంత్రించునాడెట్లయ్యెను? నిత్య ధరమ్మములను అతడు ఎట్లు నాశనము చేసెను. ఇవి అన్నియును మాకు చెప్పవలయును.
సూతుడు మహర్షులు పలికిన మాటలు విని రోమాంచితుడై ఆనందముతో మహావిష్ణు ధ్యానమునందు మగ్నుడై సంతోషముతో మునులతో ఈ విధముగ పలికెను.
సూతుడు పలికెను.
ఓ మునులారా? శ్రద్ధగా వినండి. అత్యాశ్చర్యకరమైన భవిష్యత్తులో జరుగబోయే భగవంతుని అత్యద్భుత అవతారమును గురించి మీకు చెప్పెదను. ఈ దివ్యలీల గురించి పూర్వము నారదుడు పద్మసంభవుడైన బ్రహ్మదేవుని అడుగగ, బ్రహ్మదేవుడు చెప్పెను. దానిని నారదుడు మహాతేజస్వి అయిన వ్యాసునికి చెప్పెను. వ్యాసుడు ధీమంతుడైన తన పుత్రుడు బ్రహ్మరాతునకు (శకునకు) చెప్పెను. శుకుడు అభిమన్యుని పుత్రుడైన విష్ణురాతునకు (పరీక్షిత్తుకు) భాగవత ధర్మములను సభలో, పద్దెనిమిదివేల శ్లోకములలో (శ్రీమద్భాగవతము) చెప్పెను. ఏడు రోజులపాటు నిర్వీరాముగా ఈ పురాణమును విన్న పరీక్షిత్ మహారాజు (సర్పకాటుచే) దేహమును చాలించెను. అప్పటికి భగవంతుని లీలా గానము పూర్తి కాలేదు. పరీక్షిత్ మహారాజు ఈ లోకమును వదలిన పిమ్మట మార్కండేయాది మహామునులు శుకమహర్షిని ఆ దివ్య ఆశ్రమములో ఇదే విషయమును అడిగిరి. ఆ పుణ్యశ్రేమములో శుకమహర్షి చెప్పిన దానిని వారి ఆజ్ఞగా మీకు చెప్పెదను. భగవంతుని మహిమను చెప్పునని, పుణ్యము ప్రసాదించునవి, మంగళకరమైనవి, భవిష్యత్తులో జరుగబోయేవి నేను విన్నవి అయిన కథలను మీకు చెప్పెదను. సమాహితులై మీరు వాటిని వినవలయును.
శ్రీకృష్ణుడు తన స్వధామమునకు వెడలిన పిమ్మట కలి పురుషుడు భూలోకములో ఎలా ప్రవేశించెనో మీకు చెప్పెదను. వినండి. పూర్వము ప్రళయకాలము గడచిన పిమ్మట జగత్తును సృష్టించిన లోకపితామహుడైన బ్రహ్మదేవుడు నల్లని వర్ణములో ఘోరమైన రూపము కలిగిన పాపమును తన శరీర వెనుకభాగము నుంచి సృష్టించెను. బ్రహ్మచే సృష్టించబడిన ఆ పాపము మూర్తీభవించి (రూపము ధరించి) అధర్ముడని ప్రసిద్ధమయ్యెను. ఆ అధర్ముని యొక్క వంశమును గురించి వినుట వలనను చెప్పుట వలనను స్మరించుట వలనను మానవులు సమస్త పాపముల నుండి విముక్తులగుదురు. అధర్మునకు పిల్లి కన్నుల వంటి కన్నులు కలిగి మనోహరమైన రూపము కలిగిన మిధ్య అను భార్య ఉన్నది....
పేజీలు : 136