నేటి సమాజంలో చెప్పుకోలేని సమస్యలను, బాధలను పడుతున్నవారు మధ్య తరగతి కుటుంబాలవారే. వారిని దృష్టిలో పెట్టుకొనే రచయిత ఈ గ్రంథాన్ని రచించారు. మధ్యతరగతివారు అటు ధనికుల్లా జీవించలేక, ఇటు శ్రామికుల్లా సరిపెట్టుకోలేక మధ్యలో నలిగిపోతుంటారు. కుటుంబాల్లో అనేక సమస్య లుంటాయి. కొన్ని చెప్పుకో రానివి, మరికొన్ని సహింపరానికి, ఇంకొన్ని భరింప రానివి. వాటిని నివారించుకోడానికి అనేక మార్గాలు వెతుకుతుంటారు. అవి ఒక్కొక్కసారి ఫలితాలను కలిగింప వచ్చు లేదా విపరీతాలను సృష్టించవచ్చు. నేటికాలంలో మధ్యతరగతివారెవరూ స్వర్గం పొందాలనో, అప్సరసలను అనుభవించాలనో, రాజ్యాలను ఏలాలనో సర్వసాధారణంగా అభిలషించరు. కూతురు పెండ్లి కావాలనో, కొడుకు ఉద్యోగం రావాలనో, భర్త ఆదాయం పెరగాలనో, మంచి ఇల్లు, మంచిపేరు పొందాలనో ఉవ్విళ్లూరు తుంటారు. అటువంటివారికి ఖర్చుతో కూడుకొన్న యజ్ఞాలు, యాగాలు, యోగాలు చేయమంటే ధనబలం, కాలవ్యవధి లేని మధ్యతరగతివారు చేయలేరు సరికదా మరిన్ని సమస్యలకు లోనవుతుంటారు. అటువంటి మధ్య తరగతివారు తమకు తామే నివారణలు పొందుటకు సహకరిస్తుందనే ఉద్దేశంతో రచయిత ఈ గ్రంథాన్ని రచించారు. యంత్ర, తంత్ర, మంత్ర చరిత్ర పూర్వపరాల గూర్చి రచయిత రాసిన సుదీర్ఘ ఉపోద్ఘాతము మాత్రం మేధావులకు తప్ప సామాన్యులకు అంతగా రుచింపదు. కాని అది తప్పనిసరి విషయం.

అయితే ప్రాచీన శాస్త్రాల్లో చెప్పబడిన పరిహారక క్రియలు అంత సులువుగా పట్టుబడేవి కావు. నేటి కాలంలో ఆచరణయోగ్యాలకు అందుబాటులోనివి అంతకన్నా కాదు. అందుకే సులువుగా, ఇంటిలోని వస్తువులతో, అపకారం లేని పద్ధతిలో, ఎవరికివారు, సమస్యలను నివారించుకునే ప్రక్రియలను మాత్రమే ఈ గ్రంథంలో పొందుపరిచారు రచయిత. శాస్త్రవేత్తలకు, సాధనాపరులకు రచయిత ఉదాహరించిన ప్రక్రియలన్నీ సామాన్య మైనవిగా కనబడుట సహజం. కాని లక్షలాదిమంది మధ్యతరగతివారికి ఉపకరిస్తుందనేది నిజం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good