మనుషుల్లో ఉన్నన్ని రకాలు కథాల్లోనూ ఉన్నాయి. 'పురుషులందు పుణ్య పురుషులు వేరయా'అన్నట్లు కథల్లో గొప్ప కథలు వేరు. గొప్ప కథకులు అన్నప్పుడల్లా రారు. గొప్ప కథకులు వస్తే గాని గొప్ప కథలు రావు. ఏ చెట్టుకు ఆ కాయే కాయటం తప్పనిసరిగద.
ఈనాడు వెలువడే అసంఖ్యాకమైన కథలు పిప్పరమెంటు బిళ్ళలల్లే చప్పరించేసి మింగేవి, నమిలేవి కావు. సాధారణంగా ఆహారాన్ని నమిలే అలవాటు లేనివాళ్ళకి త్వరలోనే పళ్ళూడిపోతాయి. ఆ తరువాత దేన్నీ వాళ్ళు కొరకలేరు. నమల్లేరు.
వర్తమానాన్ని విమర్శించటానికి పూనుకున్న కథ మధ్యతరగతి లోతులు మథించటం ఆరంభించింది. లోతుకు పోవటం ఎంత కష్టమో ప్రయత్నించిన వాడికి తెలుస్తుంది. పది అడుగుల లోతుకు వెళ్ళటం కన్నా పదకొండు అడుగుల లోతుకు వెళ్ళటం రెట్టింపు కష్టం. ఆ తరువాత అంగుళం అంగుళానికి కష్టం పెరిగిపోతుంది. (రెస్ట్మాస్ గల అణు కణాలు కాంతి వేగాన్ని సమీపించేటప్పుడు వాటి భారం ఏ రేటున పెరిగేదీ శాస్త్రజ్ఞుల నడగండి!)
"తీర్పు" వీటిలో కలిసే కథ కాదు. కాని నాలుగు ఒకే రకం అట్టల మధ్య అయిదో అట్ట కాస్త మేలురకంది చేరితే ఎలాంటి ఆర్థిక రాజకీయ సమస్య ఏర్పడేది ఈ కథ చిత్రిస్తున్నది. జీవిత సత్యాలు ఎంత చిన్న వాటిలోనైనా కనిపిస్తాయన్న నా నమ్మకాన్ని ఈ కథ బలపరుస్తున్నది.
- కొడవటిగంటి కుటుంబరావు