ఎన్ని మార్పులు వచ్చినా, మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.
కలహంస : ''రారా... సామి రారా... నువ్వు రారా... రారా...''
రాజేంద్ర నిదరమత్తు వదిలిపోయింది. అది కలకాదని, శిల్ప అభ్యాసం చేస్తుందని అర్థం అయింది. ఈసారి పాటకు బదులు మంజీరాల ధ్వని మధుర మంజులంగా, లయబద్ధంగా వినిపించింది.
''స్వామి రారా... నువ్వు రారా... యదుకులాంబుధి చంద్రా!'' చైత్రమాసపు ఉక్క భరించలేక రాత్రంతా అటూ ఇటూ దొర్లాడు. తెల్లవారుఝామున వీచే పిల్లగాలులు అతడిని జోకొట్టి వెళ్ళాయి. ఆ కలత నిదురలో యెన్నో మదుర స్వప్నాలు కల చెదరకుండా ఊపే... మంజీరాల ధ్వని తారాస్థాయిని అందుకుంది. లేచి ఒళ్ళు విరుచుకుని బయటికి చూచాడు. కిటికీకి ఇరుప్రక్కల ఉన్న సన్నజాజి, గులాబి మొక్కలు ఉల్లాసంగా ఊగాయి. విచ్చుకున్న పూలు అతడిని పరిహసించినట్టు అనిపించింది. ఒక్కసారి బద్ధకాన్ని దులిపేస్తున్నట్లు లేచాడు. వరండాలోకి వచ్చేసరికి మోడామీద కూర్చుని గజ్జెలు విప్పుకునే ప్రయత్నంలో ఉన్నది శిల్పం. ఎదరు గదిలో వాయిద్యాలు సర్దుకుంటున్నట్టు శబ్దం వచ్చింది....