ఒక అద్భుత కల్పిత కథాకావ్యం కళాపూర్ణోదయం. దీనిని రచించినవాడు పింగళి సూరనామాత్యుడు. భావబంధురమైన కవితారచనలో నేమి, అపూర్వకల్పనా సామర్ధ్యంలో నేమి, తిక్కన వంటి వారిని మినిహాయిస్తే, సూరనార్యుడికి సాటి వచ్చేవాడు ఆంధ్ర కవులలో మరొకడు లేడు. ఇతను సంస్కృతాంధ్రము లందు అసమాన పండితుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. అల్లసాని పెద్దనాదుల వలె ఇతను ఐశ్వర్యంలో మునిగితేలినవాడు కాడు. ఆత్మగౌరవం, స్వవంశాభిమానం కలిగి నిరాడంబరంగా జీవించాడితడు.

మహాకవి సూరనార్యుడు కళాపోర్ణోదయ కథను ఎనిమిది ఆశ్వాసాలుగా రచించిన తీరు చూస్తే అత్యద్భుతమైనదిగా కనిపిస్తుంది. కథను వివరంగా చెప్పే పద్ధతులు సాధారణంగా రెండు. సంఘటనలు జరిగిన కాలక్రమానుసారంగా కథను అల్లుకునిపోవడం ఒక పద్థతి. అలాకాక, కాలక్రమాన్ని వదిలిపెట్టి, సందర్భోచితమైన ఏదో ఒక సంఘటనతో కథ ప్రారంభించిన తరువాత ముందు వెనుకలుగా కథను పెంచుకుంటూ పోయి ఒక ఘట్టంలో పూర్తి చేయడం రెండవ పద్ధతి. దీనిని మరోవిధంగా చెప్పాలంటే, మొదటిది కాలక్రమం, రెండవది కార్యకారణక్రమం. మామూలుగా కథా రచనలో కాలక్రమ పద్ధతికే ప్రచారం బహుళం. పాఠకుడికి కూడా అదే సులువు. అయితే మహాకవి సూరన ఈ పద్థతి విడచి రెండవదియగు కార్యకారణక్రమంలో కథను వర్ణించాడు. ఇట్టి పద్ధతిని అనుసరించిన ఆంధ్రకవి ఇతను తప్ప ఇఒకొకరు లేరు. ఇంకా చెప్పాలంటే కళాపూర్ణోదయం తెలుగులోనే కాక, దక్షిణ భారత సాహిత్యంలోనే తొలి నవల.

కాలక్రమాన్ని బట్టి చూస్తే కళాపూర్ణోదయం కథకు మొదలు, అందలి పంచమాశ్వాసం. మామూలుగా మరొక కవి అయితే పంచమాశ్వాసాన్ని ప్రధమాశ్వాసంగా చేసి కథ చెప్పేవాడు. అసమాన ప్రతిభాశాలి అగు సూరనార్యుడు అలా కాక కథలోని కడపటి విషయంతో కథ ప్రారంభించాడు. కథ మధ్యభాగాన్ని ముందు వెనుకలు చేశాడు. చేసి కథ మొదటి భాగాన్ని చివర చేర్చాడు. అలా చేర్చి ప్రధాన కథతో చాలా దగ్గర సంబంధం ఉన్నప్పటికీ, ఆ విషయం తెలియకుండానే అనేక అవాంతర కథలు చమత్కారంగా కల్పించాడు. కార్యాలు ముందు చూపి, మారుస్తూ ఒక ఇంద్రజాలం చేశాడు. ఆది నుంచి అంత్యం వరకూ కనపడీ కనపడకుండా ప్రధాన కథ మహావేగంగా పరుగెత్తేటట్లు కావ్యం రచించాడు. ఆహా! ఎంతటి ప్రజ్ఞ! ఎంతటి వైదుష్యం!

Write a review

Note: HTML is not translated!
Bad           Good