''సుఖపడే సంసారాన్నీ ఒక్కలాగే ఉంటాయి. కష్టపడే సంసారాల్లో వేటిదోవ వాటిదే!'' అంటాడు టాల్‌స్టాయ్‌ 'అన్నా కెరినీనా' నవలను ప్రారంభిస్తూ. ఈ ప్రత్యక్షరసత్యం, సంసారాలకే గాదు: వ్యక్తులక్కూడా అన్వయిస్తుంది.

మంటి నుండి మింటి కెగసినవారి సంఖ్య ఎప్పుడూ పరిమితమే. ప్రపంచంలోని ఆరవవంతు భూభాగంలో సామ్యవాద వ్యవస్థను నెలకొల్పిన లెనిన్‌; 'నేను జయించడానికి, ఈ భూమండలం మీద కొద్ది దేశాలే వున్నాయి' అని విచారించిన నెపోలియన్‌; సంచార - జాతులను కూడగట్టి, బలీయమైన ప్రభుత్వాలను గజగజలాడించిన ఛెంఘీజ్‌ఖాన్‌; రైతుబిడ్డగా పుట్టి, కార్ల సామ్రాజ్యాధిపతిగా కన్నుమూసిన హెన్రీ ఫోర్డ్‌; కష్టాలను, కన్నీటిని ఆరగించి, మహానటుడుగా ప్రపంచ ప్రజల జేజేలందుకొన్న చార్లీ చాప్లిన్‌; ఎండిపోయిన రొట్టెను ఆకలికి అడ్డంపెట్టి, ఆచంద్రార్కం నిలిచిపోయే వ్యంగ్య చిత్రాలను తీసిన వాల్ట్‌ డిస్నీ; ఇంకా క్రిజ్లర్‌, కార్వర్‌, డన్‌లప్‌, గుడియర్‌, విశ్వేశ్వరయ్య మొదలైనవారు ఏ దేశంలోనైనా, ఏ కాలంలోనైనా కొద్దిమందే ఉంటారు. 

ఈ నవలలోని రామకృష్ణయ్య కూడా ఈ కోవకు చెందినవాడే: గర్భదారిద్య్రంలో జన్మించి, కోటికి పడగలెత్తాడు. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నాడు. అవసర మనుకొన్నప్పుడే, అవకాశాలను తనకుతానుగా సృష్టించుకొన్నాడు. దారిద్య్రమూ దాని ఫలితాలూ, రామకృష్ణయ్య జీవితాన్ని తీర్చిదిద్దాయి. సామాజిక పరిస్ధితులు ఉప్పెనగా విరుచుకుపడి, అతన్ని కకావికలు చేసినప్పుడు, ఆ మహావిధ్వంసం నుండే ఆయన కొత్త జీవితానికి కావలసిన ప్రాణశక్తులను సేకరించుకున్నాడు....

- రావూరి భరద్వాజ

Write a review

Note: HTML is not translated!
Bad           Good