కాదంబరి రచించినది బాణభట్టు. అతను మహాకవి. కన్యాకుబ్జాన్ని పాలించిన హర్ష చక్రవర్తి ఆస్ధాన కవులలో ఒకడు. మయూరకవి ఇతని సమకాలికుడు. బాణుడు క్రీ.శ. 606-645 మధ్య ఉన్నవాడని చరిత్రకారుల అభిప్రాయం. ''బాణోదిచ్చిష్టమ్‌ జగత్రయమ్‌'' అని లోకోక్తి. అవును. బాణుడు చవిచూడని విషయం మూడు లోకాలలోనూ లేదు. కాదంబరి, హర్షచరిత్ర బాణుని రచనలు. దండి దశకుమార చరిత్ర తరువాత సంస్కృతంలో తొలి గద్య కావ్యం కాదంబరియేనని చెపుతారు. ఇందలి కవిత్వం కఠినమే కాని, కష్టపడి చదివితే సకల శబ్దార్ధ జ్ఞానం సిద్ధించడమేకాక, రస వాహినిలో ఈదులాడవచ్చు. ''కాదంబరీ రసజ్ఞేభ్య ఆహాఠోపి నరోచతే'' - అని అంటారు. నా నా రసోల్లాస, భాసురమూ, సురుచిర భావోదయ విలాస మనోహరమూ, నానాలంకార శోభితమూ అయిన కాదంబరి సంస్కృతంలో హద్యమైన గద్య కావ్యం. శబ్ద ప్రయోగంలోనేమీ, చమత్కారంలోనేమీ ఈ మహాకవి అద్వితీయుడు. ఈ కావ్యంలో పూర్వభాగం మాత్రమే బాణభట్టు రచన. కృతి సమాప్తి కాకుండానే బాణుడు దివంగతుడు కాగా, ఆయన కుమారుడు భూషణభట్టు ఉత్తర భాగాన్ని పూరించి, కావ్యం పూర్తి చేశాడు. ఈ కావ్యంలో శృంగారం ప్రధాన రసం. ఇందలి వర్ణనలూ, కల్పనా చమత్కారాలూ అనన్యాదృశాలు. నేను సంస్కృత మూలాన్ని ఆంగ్తానువాదాన్ని దృష్టిలో ఉంచుకొని కొంత స్వేచ్ఛతో రచన సాగించాను. అందని అంద చందాలెన్నో ఉన్న ఈ రమణీయమైన కృతి తెలుగు పాఠకుల ఆదరాభిమానాలను చూరగొంటుందని ఆశిస్తున్నాను. - రెంటాల గోపాలకృష్ణ

Write a review

Note: HTML is not translated!
Bad           Good