ఈ 'కాల ప్రవాహం' సంపుటిలోని కథలు గతంలో అనేక పత్రికలలో అచ్చయినప్పుడే నేను చదివాను. వివిధ కోణాల్లోని కథాంశాలను హృద్యమంగా రచించిన తహిల రచయితలను మనం ముందుగా మనస్ఫూర్తిగా అభినందించాలి.

డిటెక్టివ్‌, సైన్స్‌ ఫిక్షన్‌ ఎక్కువగా రాసి పేరుపొందిన తమిళ రచయిత 'కీ.శే.సుజాత' అసలు పేరు: 'రంగరాజన్‌' గారి రచన 'కుందేళ్లు' కథ కూడా ఇందులో ఉంది. శాస్త్రవేత్తలు సాధారణంగా ఎలుకలు, కప్పలు, కుందేళ్లు వంటి మూగజీవాలపై పరిశోధనలు చేస్తుంటారు. వాళ్ళు తయారు చేసిన మందులను వాటిపై ప్రయోగించినప్పుడు అవి ఎంతగా నరకయాతన అనుభవిస్తున్నాయో తెలిపేదే 'కుందేళ్లు' కథ. పేదవాళ్లకు మనం సాయం చేయాలనుకున్నా వాళ్ళలో వాళ్ళే అడ్డుపడే విధానం, మననుండి సాయం పొందడానికి కూడా వాళ్లకు కొన్ని నిర్బందాలు అడ్డుతగులుతాయని తెలియజేస్తుంది 'నిబంధన' కథ. తన ఇంటిమీద మమకారంతో తన ఇంటిని, వారసులు ఎక్కడ అమ్ముకుంటారోనన్న బెంగతో - పిల్లలు విదేశాలకు వెళ్ళి స్థిరపడినా, వాళ్లు రమ్మని పిలిచినా వెళ్ళడానికి ఇష్టపడక ఆ ఇంట్లోనే ఉండిపోయిన ఓ సగటు మనిషి జీవితమే 'కాల ప్రవాహం' కథ. మూల రచయిత : ఇందిరా పార్థసారథి

తమిళ రాజకీయాలను శాసించిన ఇద్దరు రాజకీయవేత్తల కథలు ఇందులో రెండున్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి రాసిన 'ఉడుతపిల్ల' కథ. ఇరు వర్గాలమధ్య అకారణంగా చెలరేగిన వైషమ్యాలు ఒక ఉడుతపిల్ల మరణం ద్వారా ఎలా సమసిపోతుందో తెలియజేస్తుందీ కథ. రెండవది కీ||శే||అన్నాదురై రాసిన 'ఎర్ర అరటి' కథ. ఇందులో .. కొందరి యాజమాన్య స్వార్థ ప్రయోజనాలకు కార్మికుల ఆశలు ఎలా ఆవిరైపోతాయో తెలియజెప్పి, ఆలోచింపజేసే కథ, ఆర్థ్రమైన కథ ఇది. ఈ మేటి రాజకీయవేత్తలకు, రాజకీయాలతోపాటు సాహిత్యాభిలాష ఉండటం అరుదైన గొప్ప విషయం. అందుకే వారు ప్రజలకూ, సాహిత్యాభిమానులకూ చేరువ కాగలిగారు.

ఈ కథల సంపుటిలో 'ఔను బ్రూనో' కథ ప్రత్యేకమైంది. చరిత్రలో 'బ్రూనో' మరణం గురించి మనకు అంతగా తెలియదు. ఆయన మరణం వెనుక దాగిన కొన్ని కారణాలను పరిశోధించి రాసిన కథ ఇది. మూల రచయిత ఎస్‌.రామకృష్ణన్‌.

21 కథలున్న ఈ సంపుటిలో ఒక్కోకథ ప్రత్యేకమైనదే. జిల్లెళ్ల బాలాజీ చక్కటి అనువాద విధానం వల్ల ఈ కథలన్నీ తెలుగు పాఠకుల నేటివిటీకి దగ్గరగా ఉన్నాయి. కథల్లోని పాత్రలన్నీ మన చుట్టూ జరుగతున్న సన్నివేశాలే అనిపిస్తాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good