కె.వి.ఆర్.లో మనకు కనిపించే ఒక ప్రధాన లక్షణం తన వ్యాసాలలో సమకాలీన సాహిత్యాన్ని విశ్లేషించడం. ఇరవయ్యేళ్ళ వయసులోనే అభ్యుదయ రచయితల సంఘ సభ్యుడై రెండు దశాబ్ధాల పాటు ఆ సంస్ధను మోశాడు. ఆ సంస్ధలోని మంచి చెడ్డల్ని విశ్లేషించాడు. నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని ప్రకటించాడు. సి.నా.రె., రాయప్రోలునూ, గురజాడనూ, ఇద్దరినీ యుగకర్తలుగా పేర్కొంటే, కె.వి.ఆర్.- ''రాయప్రోలు ప్రాచీనులలో నవీనుడు, నవీనులలో ప్రాచీనుడు'' అని నిక్కచ్చిగా తేల్చి చెప్పాడు. వర్తమానంలో గతమూ, భవిష్యత్తూ రెండూ ఉండాయనీ, గతాన్ని తిరస్కరించి భవిష్యత్తును చూడగల రచయితలే ప్రజాస్వామ్య సోషలిస్టు రచయితలుగా వవరించాడు. అభ్యుదయ కవిత్వం భావకవిత్వంపై తిరుగుబాటు మాత్రమేకాదనీ, అది కవిత్వ సనాతన సంప్రదాయాన్ని ధిక్కరించి, నవీన సంప్రదాయాన్ని నెలకొల్పి గలిగిందనీ అన్నాడు. అరసంలో ఉంటూనే, అరసం ఆశయాలకు భిన్నంగా రాసే అభ్యుయద రచయితలను తన విమర్శవేటు పడకుండా వదల్లేదు. సమాజంలో ఉండటమంటే సమాజాన్ని పూర్తిగా ఆమోదించడం కాదని చెప్పి, ఆ దృష్టి కోణం నుండి గతితార్కిక భౌతికవాద దృక్పథంతో సమకాలీన రచయితల్నీ, ఉద్యమాల్నీ విశ్లేషించారు. ఆయన విమర్శధాటికి తట్టుకోలేక కె.వి.రమణారెడ్డి అంటే కసుపూరు వెంకట రమణారెడ్డిగా గాక క్రూర వీర రమణారెడ్డిగా కొందరు వర్ణించారు. |