''నిమ్మసేద్యం చేసే ఒక ముస్లిం సేద్యగానికి పుట్టిన షరీఫ్ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండలేకపోయాడు. రెండు ముద్దలు సంపాదిస్తే నాలుగు నోళ్లు ఎదురు చూసే తమ కుటుంబం పరిస్థితికి చలించాడు. తాము ఇలా ఎందుకు ఉన్నామో తమలాంటి వాళ్లంతా ఇలాగే ఎందుకు ఉన&ఆనరో ఆలోచించే ప్రయత్నం చేశాడు. దు:ఖం వచ్చింది. కోపం వచ్చింది. ఆవేశం వచ్చింది. ఆలోచన వచ్చింది. అరె.. నాకిలా అనిపిస్తుంది అని కథ రాయాలనిపించింది. రాశాడు. అమ్మ, నాన్న, ఊరు, దేశమంతా బిక్కుబిక్కు మంటూ గడిపే ప్రతి ముస్లిం ఆత్మా అతడి కథ అయ్యాయి.
కూసుగా ఉండే వాక్యం, కుదురైన నడక, అవసరమైన చాతుర్యం, తుడిచిన అద్దంలా కనిపించే నిజాయితీ ఈ కథలను అలరించాయి. ఇవన్నీ వర్తమాన కథలు అని కొందరికి అనిపించవచ్చు. చాలా పాతకథలే అని మరికొందరికి అనిపించవచ్చు. పాతబాధల్ని కొత్తగా రాస్తున్నాడని ఇంకొందరికి అనిపించవచ్చు. ఏమని అనిపించినా ఇవన్నీ పాఠకులను ఆకట్టుకున్నాయి.