పరమాత్మను బ్రోచు భక్తి పరాయణులందరికీ 'గీతా గోవిందము' సుపరిచితము. ఈ కావ్య సృష్టికర్త జయదేవ మహాకవి.
క్రీ.శ. పన్నెండవ శతాబ్దంలో ఉత్కల దేశంలోని పూరీ జగన్నాథ సమీపంలో బిందు బిల్వమనే గ్రామంలో జన్మించాడు. జయదేవుని ఇంటి పేరు కూడా బిందు బిల్వమని చరిత్రకారులు కొంతమంది ఉద్ఘాటిస్తున్నారు.
జయదేవుని తండ్రి భోజదేవుడు, తల్లి రాధాదేవి. ఈ విషయాన్ని గీతా గోవిందంలో పన్నెండో సర్గములో జయదేవుడే స్వయంగా ఓ శ్లోకంలో చెప్పాడు.
జయదేవుడు లక్షణ సేన మహారాజ ఆస్థాన కవిగా గొప్ప కీర్తి ప్రతిష్ఠలను పొందాడు. కడు పిన్న వయస్సులోనే మాతా, పితలు స్వర్గస్థులు కాగా వంటరివాడయి పోయాడు జయదేవుడు. ఇతని పూర్వాపరాలు వివిధ రకాలుగా వినవస్తాయి. ఇతని వివాహం పైన కూడా ఇలాంటి భిన్న కథనాలున్నాయి....
జయదేవుడు రాజాస్థానం వదిలి తన ఊరు బిందుబిల్వము చేరి 'గీతాగోవిందం' రచించాడు అన్నది ఒక కథ. ఈ కథలో రెండవ కథ ఏమిటంటే జయదేవుడు లక్ష్మణ సేన మహారాజు ఆస్థానంలో ఉండగానే తన భార్య అగు పద్మావతి శ్రీకృష్ణుని యందు నృత్యం చేస్తున్నట్లుగా ఊహించుకుంటూ తన పదములు కూర్చాడు అన్నది.
ఈ అష్టపదులు లోకమునకు ఇష్ట పదులై భాసిల్లటానికి ఒకే ఒక కారణము ఈ కావ్యములో భక్తి, శృంగారం అనే వేరు వేరు పార్శాలు లేవు. ఇదంతయూ భక్తి రసరమ్య శృంగార కేళీ విలాసము. అందుకే ఈ అష్టపదులు వింటున్నప్పుడు మనస్సు అమృతం సేవిస్తుంది. చెవు చాటంత అవుతాయి, కళ్ళు ఆనందంతో పువ్వులై విచ్చుకుంటాయి. పెదవులు ఆ లయకు తాళం వేస్తే నాలుక ఆ పదములలో నృత్యం చేస్తుంది.