బుద్ధుని పూర్వజన్మ కథలే జాతక కథలు. ఈ రూపాల్లో బుద్ధుడు పూర్వజన్మల్ని దర్శించాడా అన్నది ప్రశ్నార్థకమే. అయినప్పటికీ జాతక కథలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ప్రాచుర్యం పొందాయి. నేరుగా పాళీభాష నుంచి కీ.శే. తల్లావజ్జల శివశంకర శాస్త్రిగారు తెలుగులోకి అనువదించిన సంపుటాలను క్లుప్తీకరించి రెండు సంపుటాలుగా మీకు అందిస్తున్నాం. మానవుల్లో అత్యుత్తములు అనదగినవారిలో నాటికీ, నేటికీ ఎన్నదగిన వాడు బుద్ధుడు. ఆయన తత్వం మ¬న్నతం. ఉదాత్తమూ ఉన్నతమూ అయిన ఆయన వ్యక్తిత్వానికీ ఆయన బోధనలకూ ఆయన తాత్వికతకూ తగని కథలు అనేకం ఈ జాతక కథల్లో చొరబడ్డాయని హెచ్చరించాల్సిన బాధ్యత మా మీదుంది. భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ప్రాచీన రచనలన్నిటిలోనూ ఎప్పటికప్పుడు చెప్పకుండా చేర్పులూ మార్పులే చేసెయ్యడం శతాబ్దాలుగా సాగుతున్న వింత ఆనవాయితీ. మూలగ్రంథాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ మార్చరాదన్న పవిత్ర సూత్రాన్ని ఇక్కడ మనవాళ్ళు పదే పదే ఉల్లంఘించారు. అందుకని ఏ విలువ ఏ కాలం నాటిదో, ఏది ఏ కాలానికి ఉత్తమ విలువగా గుర్తించబడిందో తెలుసుకోవడం దాదాపు దుర్లభం అయిపోయింది. అయినా పాలనీ నీటినీ వేరుచేయగల హంసల్లా ఈ కథల్లోని మంచినీ చెడునీ పసిగట్టి మంచిని స్వీకరించాలని పాఠకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. |