జాషువ మహాకవి. ఆయన లేవనెత్తిన సామాజిక సమస్యలు నన్నెంతగానో ప్రభావితం చేశాయి. ఆ స్పూర్తితో కొందరు మిత్రులతో కలసి 'మహాకవి జాషువ కళాపీఠం' ఏర్పాటు చేసుకున్నాం. ఈ కళాపీఠం ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా జాషువ జయంతి, వర్థంతిలకు అనేక సాహిత్య కార్యక్రమాలను, సభలను నిర్వహించాము. రాష్ట్రంలో పలుచోట్ల జాషువ విగ్రహాలను ఆవిష్కరించాము.
తెలుగు పద్యం మరుగున పడుతున్న కాలాన, పద్యాన్ని పండితులకు, పామరులకు దగ్గర చేశాడు జాషువ. అసమానతలు, ఆకలి, పేదరికం ఆయన కవితాత్మలు. మన రాష్ట్రంలోని సాహితీవేత్తల విగ్రహాల్లో జాషువ విగ్రహాలే ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణం ఆయన సాహిత్య సమకాలీనతే. జాషువ సాహిత్యం సామాన్యులకు అంతగా దగ్గరైంది. సమాజంలో అసమానతలు ఉన్నంతకాలం జాషువ సాహిత్యం మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది.
ఇటీవలి కాలంలో తెలుగు భాషాభిమానులు భాషను బ్రతికించుకోవాలనే తాపత్రయం ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు. వారికి నా మనవి ఏమంటే జాషువ సాహిత్యాన్ని ఎంత బాగా ప్రజల్లోకి తీసుకువెళితే అంత బాగా తెలుగు భాష మనగలుగుతుంది.
- డొక్కా మాణిక్యవరప్రసాదరావు