ఇవి కథలు కావు. వ్యాసాలు కావు. మ్యూజింగ్స్ కూడా కావు. నవ్యవీక్లికి సంపాదకుడిగా ఉన్న జగన్నాథశర్మగారు వారం వారం పాఠకులకు సమర్పించిన ఈ మొదటి పేజీ 'ప్రోజ్ పొయెమ్స్' ఆయన స్మృతి వల్మీకాలు. జ్ఞాపకాలందరికీ ఉంటాయి. కాని వాటిని ఉద్వేగభరితంగా, గుండె గొంతుకలో అడ్డుపడినట్టు పదాలలో బంధించటం మాత్రం శర్మగారికే సాధ్యం. ఇవి చదువుతుంటే ఒకసారి ఒళ్లు జలదరిస్తుంది. మరోసారి మనస్సు కలుక్కు మంటుంది. లేదా నాస్టాల్జియాతో వెన్నులో చలిపుట్టి 'ఇలా ఉండేదా ఆనాటి బతుకు' అని మనకు తెలియకుండానే మౌనంగా రోదిస్తాం. కనిపించని కన్నీరూ, పంటికింద బిగపట్టిన బాధా, చిన్ననాటి కలల జలతారు దృశ్యాలూ వీటిలో మనల్ని పలకరిస్తాయి. ఇవి శర్మగారు మనకిచ్చిన 'చిరుకానుకలు'. - ముక్తవరం పార్థసారథి
పడికట్టు పదాల్లేవు. పనికిరాని ఉపన్యాసాలూ లేవు. ఆరితేరిన కథకుడు తనదైన శైలిలో రాసిన కథనాలు ఇందులో ఉన్నాయి. సంపాదకీయం అంటే ఎత్తయిన శిఖరమ్మీదో, ఏకాంతంలోనో కూర్చొని రాసిన ప్రవేశికలు కావివి. కథాకథన శైలిలో ఆవిష్కరించిన అవతారికలివి. వీటిలో ఆశలున్నాయి. ఆకాంక్షలున్నాయి. ఆశయాలూ, అనుభూతులూ ఉన్నాయి. సమస్యల పట్ల సానుభూతితో స్పందించి, సానుకూలమైన పరిష్కారాల్ని అందించడం ఈ 'జగన్నాథ రథచక్రాల' విశిష్టత. బియ్యం గింజమీద అక్షరాలు రాసినట్లుగా గుప్పెడు వాక్యాల్లో గుండెను కమ్ముకునే భావాలకు పటం కట్టి, సంపాదకీయాలకు సరికొత్త పట్టం కట్టిన ప్రావిణ్యం ఇందులో ఉంది. ఎప్పుడు చదివినా జీవితాన్ని ప్రతిబింబించే, మనిషికి ప్రాతినిధ్యం వహించే శాశ్వత విలువలు ఇందులో ఉన్నాయి. - ఓలేటి శ్రీనివాస భాను
జగన్నాథ కథచక్రాలపేరుతో మరో భాగం కూడా వచ్చింది.