జానకితో జనాంతికం (వాక్ చిత్రం) స్వీయ చరిత్ర (దువ్వూరి వేంకట రమణ శాస్త్రి)
రాజాచంద్ర ఫౌండేషన్ తన నాలుగవ ముద్రణగా కళాప్రపూర్ణ శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారి స్వీయచరిత్ర, వారు ఆలిండియా రేడియోలో చేసిన వాక్ చిత్రం 'జానకితో జనాంతికం' కలిపి ప్రచురించారు.
జానకితో జనాంతికం
తల్లిగా జానకీ! మనం మాట్లాడుకుని చాలా రోజులైందమ్మా - అప్పుడప్పుడూ భద్రాచలం వస్తూనే ఉన్నాను. అయిదారు రోజులు ఆగుతూనే ఉన్నాను. అమ్మని పలకరించడానికి అవకాశమే కనబడదు. వచ్చే జనానికి అంతూ పొంతూ లేదాయె. వచ్చిన వాళ్ళు తమకి వావాల్సిందేదో ఆయనతో మాట్లాడుకుని వెళ్తారేమో అంటే ఆయన పిలిస్తే పలకడాయెను... పలుకే బంగారమట! అంత ఇదేమిటో? పలక్కపోతే మన అదృష్టం ఇంతే అనుకుని పోనీ ఆ వచ్చినవాళ్ళు తిరిగి పోతారా...ఊహూ. పక్కన నువ్వున్నావుగా జాలిపడే తల్లివి. 'సీతమ్మ తల్లీ! నీవైనా చెప్పవమ్మా' అని కొందరు, 'విభునికి మా మాట వినిపించవమ్మా' అని కొందరు కూనిరాగాలు తీస్తూ నీ చుట్టూ మూగుతారు. నీకీ సిఫార్సులతోనే సరిపోతుంది. ఎప్పుడూ ఇదే మేళం. ఇంక నీ దగ్గర కూచునేదప్పుడు?.....
"ఈ పుస్తకం చదివిన వారందరికీ కూడా జీవితాన్ని ఎంత సౌందర్యవంతంగా మలుచుకొవచ్చో తెలుస్తుంది! మనకున్న వాక్చమత్కృతితో - చాతుర్యంతో ఇతరులకు హాని కలిగించకుండా మన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించవచ్చో నేర్పుతుంది. ముఖ్యంగా ఆ కాలం నాటి వారి విద్యా వ్యాసంగం, వారు నిలబెట్టుకున్న విలువలు, వారి జీవితంలోని ప్రాధమ్యాలు, నేటితరం వారికి తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది".--- డాక్టర్ ధూళిపాళ అన్నపూర్ణ