బి.గీతిక రాసిన పన్నెండు కథల సంపుటి, ''ఇసుక పూలు''లో చాలా కథలకి పల్లెటూరు నేపథ్యం, వ్యవసాయం, తదితర కాయకష్టం చేసుకునే జీవితాల గురించిన కథలు ఇవి. అడవుల్లో, సముద్ర తీరాల్లో, పొలాల్లో, శ్మశానంలో తిరిగితేనేకానీ పట్టుబడని సూక్ష్మ వివరాలూ ఎన్నో అంశాలు ఈ కథల్లో వున్నాయి. ఇంటి లోపల కన్నా ఇంటి బయట జరిగే కథలు ఇవి. ఈ కథల్లో ఏ కథ చదివినా..ఆమె చాలా సులువుగా కథ చెప్పగలదన్న విషయం అర్థమవుతుంది. సరళంగా కథ చెప్పటం, క్లిష్టంగా ఉన్నచోట ఓ క్షణం ఆగి తేలికపరిచి తిరిగి ముందుకు సాగించే నైపుణ్యం వుంది.

పల్లె పట్టున బాల్యం దగ్గరనుంచి వృద్ధాప్యపు చివరి దశ వరకూ, అడవుల్లో బతికేవారికి జరుగుతున్న అమానుష అన్యాయం నుంచి ఉప్పుపంటలోని ఆర్థిక అన్యాయస్థాయి వరకూ, ఎన్నో వైవిధ్యమున్న వస్తువులు ఈ కథలకి ఆలంబన. రకరకాల జీవనతీరుల్ని, పలుకుబడుల్ని, కళ్ళముందు ఉంచుతాయి ఈ కథలు.

ఉప్పు పంటని 'ఇసుక పూలు' అనటం, గిరిజనుల బతుకుల్ని మెరుగుపరచలేక వృథా అవుతున్న పథకాల గురించి ''వెన్నెల సోకని పున్నమి' అనటం, ఈ కథల ప్రత్యేకత.

ఈ సంపుటిలోని చాలా కథలు ప్రకృతి వర్ణనతోనే ఆరంభమవుతాయి. 

''చెట్టుకి పూవు పూసినట్లు, ఇసుకకి ఉప్పు పూస్తోంది..'' అంటుంది ఉప్పు'వఱ'ల గురించి.

- వి.రాజారామమోహనరావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good