(ఇం)కోతి కొమ్మచ్చి - ముళ్ళపూడివెంకట రమణ - బాపూ రమణీయం - రెండవ భాగం ''కోతి కొమ్మచ్చి'' (మొదటి భాగం) పుస్తకం పాఠకులనే కాదు, సమీక్షకులనూ మెప్పించింది. బతుకు పోరాటంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా నవ్వుతూ బతకాలని బోధించిన జీవనవేదంగా - మొక్కవోని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని నూరిపోసిన వ్యక్తిత్వ వికాస పాఠ్యపుస్తకంగా, తెలుగునాట వెలిసిన మసలిన ఆనాటి మహానుభావులతో వ్యక్తిగత అనుభవాలను ఆవిష్కరించిన జ్ఞాపకాల మాలికగా అడుగడుగునా తెలుగు పలుకుబళ్ళను, భాషాప్రయోగాలను వెదజల్లిన చమత్కార మంజరిగిగా - ఒక శకానికి ఆద్యులైన భావుకద్వయం (ముళ్ళపూడి వెంకట రమణ, బాపు) ఎలా రూపు దిద్దుకున్నారో వివరించే చారిత్రక గ్రంథంగా - రకరకాలుగా వర్ణించారు ''కోతికొమ్మచ్చి''ని.
శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారు పత్రికా రంగాన్ని విడవడంతో మొదటిభాగం పూర్తి అవుతుంది. ఆ తర్వాతి నిరుద్యోగ విజయాలు, సినీరంగ ప్రవేశం, తొలిదశలో ఎదురైన అవమానాలు, హేళనలు, సినీరచయితగా నిలదొక్కుకోవడం, ఓ డైరెక్టర్‌ ప్రవర్తనతో విసిగి సినీరంగాన్ని వదిలివేసి వచ్చేసినా, ఆ రంగమే రెట్టింపు పారితోషికంతో పునరాహ్వానించడం, బాపుతో కలిసి చేసిన ''జ్యోతి'' ప్రయోగం మేలు చేయడం మానేయడంతో, ఏకంగా సినీ నిర్మాతలు అయిపోవడం, ప్రయోగాత్మక సినిమాల నుండి అక్కినేని అందించిన సాయంతో కమ్మర్షియల్‌ సినిమా వైపు మరలడం, 'బుద్దిమంతుడు', 'సంపూర్ణ రామాయణం' సినిమా నిర్మాణంలో ఔత్సాహిక నిర్మాతలుగా పడిన కష్టాలు.... వీటన్నింటితో ''కోతి కొమ్మచ్చి' రెండవభాగంగా (ఇం) కోతి కొమ్మచ్చి మరింత పరిచితంగా, రసవత్తరంగా సాగింది. మొదటిభాగం లాగానే ఇది కూడా మీ ఆదరాన్ని చూరగొంటుందని మా ఆశ.
'స్వాతి' వారపత్రికలో ధారావాహికంగా వెలువడుతున్న ముళ్ళపూడి వెంకట రమణ ఆత్మకథలో రెండవభాగం (36-70వారాలు) ఇలా పుస్తక రూపంలో బాపు బొమ్మలతో.... ఫోటోలతో.......

Write a review

Note: HTML is not translated!
Bad           Good