మానవులకు అసలైన ఆధ్యాత్మిక జ్ఞానం రుచించదు. ఉన్నదంతా ఆ ''రుచి'' అనే పదంలోనే వుంది. చక్కెరపాకంలో ముంచి, వినోదాత్మకంగా రూపొందించి అందిస్తే స్వీకరిస్తారు. అది మనసుకు ఊరట కలిగించేది అయివుండాలి. తాము జీవిస్తున్న తీరును సమర్థించేది అయివుండాలి. మిగతావారంతా చెడ్డ పనులు చేస్తారు గానీ తాను మాత్రం మంచి పనులే చేస్తాడని ప్రోత్సహించేదై వుండాలి. తన అస్తవ్యస్త జీవితంలో ఏ మాత్రం అలజడి కలిగించని ఆధ్యాత్మిక జ్ఞానమైతే తనకేమీ అభ్యంతరముండదు.
నిజం నిష్ఠూరంగా వుంటుందనీ, అది మనం ఊహించిన తీరుగా వుండదనీ, సత్యాన్వేషణకు పూనుకున్న తర్వాత మానసికంగా అది ఏ దుర్గమారణ్యాలకయినా తీసుకు పోగలదనీ చెప్తే, అలాంటి సత్యం ఎవడిక్కావాలండీ అంటాడు. ''ఈ ఉన్న అవస్థలు చాలకనా, ఇదొకటి జోడించుకొని మరిన్ని కష్టాలను జత చేసుకోడానికి'' అనేస్తాడు.
మనిషికి సత్యాన్వేషణపై ఆసక్తి లేదు. మనిషి కోరుకొనేది సుఖం. చేసే పాపాల్ని క్షమించే దేవుడు కావాలి. మ్రొక్కితే వరమిచ్చే వేల్పు కావాలి. తన నైతిక జీవితమెలా వున్నా తనకు సంభవించే ఆపదల నుండి కాపాడే భగవంతుడు కావాలి. ఇంతెందుకు? తన ప్రారబ్ధకర్మ నుండి సంచితకర్మ నుండి తప్పించి తన జీవితాన్ని సుఖమయం చేయకలిగిన గాడ్‌ను కానీ ''గాడ్-మాన్''ని కానీ నిరభ్యంతరంగా పూజిస్తాడు. అలాంటి జ్ఞానముంటే చెప్పండి, అలవరచుకుంటాడు.
తనని తాను నిశితంగా చూచుకోమంటే మాత్రం, చేదుగా కనిపిస్తుంది. అందువల్లనే ఏ యోగి పుంగవుడు, ఏ మౌని ఎంతటి మహత్తర ఆధ్యాత్మిక సత్యం ప్రకటించినా, అది తనకు అర్థం కావడం లేదంటాడు. ఈ మునీశ్వరుడి మాట వింటే, ఇది ఏ గోతిలో తీసుకెళ్ళి పడేస్తుందోనని భయపడుతుంటాడు. ఈ ఇంద్రియానుభవాలమీద విరక్తి జనిస్తుందేమో? ఇంద్రియసుఖాలు మృగ్యమైన ఈ జీవితాన్ని ఏం చేసుకోవాలని? మనిషి తత్త్వం బాగా అర్థం చేసుకున్న పరమహంస యోగానంద అందుకే ఒకమారు ''మనుషులు తమ అజ్ఞానాన్ని సురక్షితంగా కాపాడుకోడంలో ఎంత నైపుణ్యం ప్రదర్శిస్తారండీ'' అని ఆశ్చర్యపోయాడు.