ఇదండీ మహా భారతం!

[మొగ్గా పువ్వూలేని, కాయా పండూలేని, మోడు! మాయల, మంత్రాల, వ్యర్ధాల, వైరుధ్యాల వికృతాల, వికారాల, కౄరత్వాల అబద్దాల, కట్టు కధల, పుక్కిటి పురాణాల పుట్ట!]

"తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి" - సామెత! గారెలు తిన్న వాళ్ళకి, వాటి రుచి తెలిసే ఉంటుంది. భారతం చదవని వాళ్ళు దాని రుచి కూడా చూడండి ఒక సారి!

పరిచయం - రంగనాయకమ్మ. పరిచయానికి ఆధారం: 1. వ్యాస మహా భారతానికి కె. ఎం. గంగూలీ చేసిన ఇంగ్లీషు వచనానువాదం - ''ది మహా భారత ఆఫ్‌ కృష్ణ ద్వైపాయన వ్యాసా'', 2. కవిత్రయం రాసిన "శ్రీమదాంధ్ర మహా భారతము", 3. పురిపండా అప్పలస్వామి గారి ''వ్యావహారికాంధ్ర మహా భారతం''

* * *

'భారతం'లో, ఆడ వాళ్ళ స్థితి దీనాతిదీనం! ''పాపాలన్నిటికీ ఆడదే మూలం'' అనే బోధనలు సాగుతాయి. ''ఆడ దాని కపటత్వాన్ని కనిపెట్టడం సాధ్యం కాదు. ఏ మాయగాడైనా సరే, ఆడ దాని మాయల ముందు తీసికట్టు! ఆడ దానికి పర పురుషుడి జత వల్ల దొరికే ఆనందం, తిండి వల్ల గాని, బట్టల వల్ల గాని, నగల వల్ల గాని, దేని వల్లా గానీ, రాదు. ఆడ దానికి పర పురుషుణ్ణి చూడగానే మదన భాగం చెమ్మ గిలుతుంది. ఆడది, వంద మంది పురుషులతో జత కూడినా తృప్తి పడదు' - ఇవీ, ఆడ దానికి భారతం ఇచ్చే హారతులు!

నేను, ఈ పుస్తకానికి, ''ఇదండీ మహా భారతం!'' అని పేరు పెట్టి, దాని కింద, ''వికృతాలూ, వికారాలూ, అబద్దాలూ....'' అంటూ చాలా విశేషణాలు పెట్టాను. అవి, అన్యాయంగా పోగేసిన మాటలు కావు. లోపలికి వెళ్ళి చదివి చూడండి. ఏ విశేషణం ఎందుకు పెట్టానో అన్నిటికీ ఆధారాలు కనపడతాయి.

భారత దేశంలో మెజారిటీ ప్రజల్ని సంస్కృతి పేరుతో బుట్టలో వేసే మత గ్రంధాలు, రామాయణ, భారత, భాగవతాలు. వాటిలో వున్న నిజా నిజాలు ఈ ప్రజలకు తెలిసి తీరాలి.

ఏ దేశం అయినా ఏ యే తప్పుడు సంస్కృతుల్లో పీకల దాకా కూరుకుని వుందో ఆ సంగతి ఆ దేశంలో జనాలకు నిజంగా తెలిస్తే, వాళ్ళు అదే రకం జీవితాల్లో వుండి పోవాలని కోరుకోరు. అజ్ఞానం వల్ల అలా వుండి పోతే ఆ జీవితాల్లో ఆనందంగా వుండలేరు!

మహా భారతం నించి ఏం నేర్చుకుందాం? చాతుర్వర్ణాల నించి మరింత పెచ్చు పెరిగిన కుల విధానాన్నే పెంచుకుంటూ ఉంచుకుందామా? రాజరికాల్ని తెచ్చుకుందామా? జూదాల్ని మోసాలు లేకుండా నిజాయితీగా ఆడుకుందామా? ఆవు పేడ కలిపిన నీళ్ళతో స్నానాలు చేద్దామా? మన పాలకుల్ని ఈశ్వరులుగా పూజిద్దామా? తపస్సులు సాగిస్తూ, స్వర్గం కోసం నిరీక్షిద్దామా? - ఏం నేర్చుకుందాం భారతం నించి?

వందల వేల నాటి పురాణ పాత్రల్ని ఈ నాడు ఎందుకు విమర్శించు కోవాలి? ఎందుకంటే, అమాయక జనం ఆ పురాణ పాత్రలకే ఈ నాటికీ భక్తులై వుండి పోతున్నారు గనకే!

భారతం, ప్రకృతి సైన్సులు అభివృద్ధి చెందని క్రీస్తు వెనకటి అనేక వందల ఏళ్ళ నాటిది. పైగా మూల మూలనా మూఢ నమ్మకాలతో, శ్రమలు చేస్తూ బతికే ప్రజలను నిట్ట నిలువునా మోసాలు చేసేది. అలాంటి పురాణ గ్రంథాలకు చేతులు జోడిస్తున్నామంటే, మనం ఆధునిక మానవులం కాదు. క్రీస్తు కన్నా వెనకటి కాలంలో ఉన్నాం. ప్రాచీన కాలపు మానవులం.

- రంగనాయకమ్మ

Write a review

Note: HTML is not translated!
Bad           Good