భారతీయులకే కాదు యావత్ప్రపంచానికీ భారతదేశం పుణ్యభూమి. ఆసేతు శీతాచలం గంగా, యమున, సరయూ, కృష్ణా, గోదావరి, తుంగభద్రా, పెన్నాది పుణ్యనదులతో పునీతమైన భరతభూమి అణువణువూ సస్యశ్యామలమే! భారతదేశంలోని ప్రతి తావూ దైవానికి, దివ్యశక్తులకూ ఆలవాలమే! అష్టాదశ శక్తిపీఠాలూ, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు, పంచ నారసింహ క్షేత్రాలు, అసంఖ్యాకమైన శివ, విష్ణు, దేవీ దేవాలయాలు, బౌద్ధారామాలు, జైన, సిక్కు సంప్రదాయ పుణ్యక్షేత్రాలు భారతదేశమంతటా సర్వేసర్వత్రా వ్యాపించి భక్తజనులను కాచి సంరక్షిస్తున్నాయి.
ఇవికాక ప్రకృతి రమణీయతకూ, పర్యాటక విశేషాలకూ కొదవేలేని కోకొల్లలుగా భారతదేశమంతటా పరివ్యాపించి వున్నాయి. విభిన్నమైన సంస్కృతీ సంప్రదాయాలు ఆయాజాతుల, తెగల ప్రత్యేకతను కళ్ళకు కట్టినట్టుగా దర్శనమిస్తాయి. 29 రాష్ట్రాలతో 6 కేంద్రపాలిత ప్రాంతాలతో సుశివాలమైన భారతదేశాన్ని ఆద్యంతం దర్శించడానికి జీవితకాలం చాలదనేది కాదనలేని నిజం!
భారతదేశంలోని ఒక్కో రాష్ట్రానికీ, ఒక్కో ప్రాంతానికీ తనదైన ప్రత్యేక సంస్కృతీ సంప్రదాయాలున్నాయి. భిన్న భిన్నమైన సంప్రదాయాలన్నీ 'భారతీయత' అనే ఏక సూత్రంతో ఒక ఆకర్షణీయమైన మాలగా మనకు అనుభవానికి వస్తుంది. ఇంతటి మహోన్నతమైన భారతదేశంలోని పుణ్యక్షేత్రాలను, పర్యాటక ప్రదేశాలనూ, నదీతీర నగరాలను, ప్రకృతి శోభను కళ్ళ ముందుంచేలా ఆయా ఫోటోలతో అందిస్తూ, పుణ్యక్షేత్ర విశేషాలతో పాటు పర్యాటక ప్రాంత ప్రాముఖ్యాలను తెలియజేస్తూ... ఆయా ప్రాంతాలకు రవాణా సదుపాయాల మార్గసూచీని, స్థానిక హోటళ్ళ ఫోన్ నెంబర్లు కూడా పాఠకుల సౌలభ్యం కోసం ఈ పుస్తకంలో ఆయా ప్రదేశాల వద్దే పొందుపరచడం జరిగింది.
''సంపూర్ణ భారతదేశ యాత్రావిశేషాలు'' అనే ఈ అమూల్యమైన పుస్తకం తెలుగు ప్రజలందరి భారతదేశ యాత్రాకాంక్షను తీరుస్తుందనీ, యాత్రికులందరికీ కరదీపిక కాగలదు.