ఎవ్వరికీ కనబడగూడదనుకుని ఎంతగా నేను ఎడ్లబళ్ల పక్కన ఒదిగి ఒదిగి నడుస్తున్నా, మా పెదనాయన నంబూరి నర్సయ్యగారి కంట పడనేపడ్డాను. నన్ను చూచి, ఒక్కసారిగా మొదట అబ్బురపడి, తరువాత ఆగ్రహం వెళ్లగక్కుతూ ''ఏంటే యిది పూర్ణమ్మా! చెప్పా పెట్టకుండా మా వెంట వస్తున్నావేంటి? బొత్తిగా భయమూ, భక్తీ లేదే? నీలాగా మరే పిల్లలుగానీ వస్తున్నారా మా వెంట?'' అని గద్దిస్తూ అరిచారు.

నేను గజగజా వణుకుతూ, ఉలుకూ పలుకూ లేకుండా నుంచున్నాను. మళ్లీ అంతలోనే ఆయన ఎందుకనో శాంతరసంలోకి దిగిపోయారు. ''ఏమే పూర్ణమ్మా! వస్తే వచ్చావుగానీ - పాటలు, పద్యాలు బాగా పాడుతుంటావు గదా - హరిశ్చంద్రలో లోహితుడి పద్యాలేమయినా వచ్చునా నీకు? ఈ రాత్రి కిష్టారంలో వెయ్యబోతున్న హరిశ్చంద్ర నాటకంలో లోహితుడి పాత్రకు తగ్గవాడెవ్వడూ కనపళ్లేదు. ఆ పాత్ర నువ్వు చెయ్యగలవేమో చూడు, చేద్దువుగాని, ఏం?'' అని ఆయన అడిగీ అడగనంతలోనే, ''లోహితుడి పద్యాలన్నీ నాకు బాగా వచ్చు పెద్దనాయనా!'' అని జవాబిచ్చాను కొండంత సంబంరంగా. ''మా నాయనా, అన్నయ్యా పాడుతుంటే విని నేర్చుకున్నానుగా. లోహితుడు మునిబాలకులతో కలిసి విస్తళ్ళ ఆకుల కోసం అడవిలోకెళ్లి, పుట్టమీదకెక్కి ఆకులు కోస్తుండగా పుట్టలోంచి పామొచ్చి కాటేస్తుంది గదా! అప్పుడతడు తోటి బాలకులతో, ''అయ్యలార, నేను ఆకులు కోయంగా పుట్టలోని పాము పట్టి కరచె, విషము తలకెక్కె. నేను జీవించనయ్య, కడకిదే మీకు నా నమస్కారమయ్యా!' అన్న పద్యంతో ఆ బాలకులకు చెప్పి, చచ్చిపోతాడు గదా! అది, ఆ పద్యం, బాగా ఇష్టం నాకు. చెయ్యమంటే లోహితుడి వేషం తప్పకుండా చేస్తాను పెదనాయనా!'' అని పలికాను హుషారుగా....

పేజీలు : 248

Write a review

Note: HTML is not translated!
Bad           Good