''ప్రపంచంలోని దోపిడి శక్తులన్నీ గొప్ప ఐక్యతతోనూ, అద్భుతమైన సృజనాత్మకతతోనూ వర్గపోరాటం సాగిస్తూ ఉన్నాయి. పీడితుల పక్షాన నిలవాల్సిన వాళ్ళు మాత్రం పరస్పర కుమ్ములాటల్లో వాళ్ళ శక్తుల్ని ధారపోస్తున్నారు'', అన్నాడు జేమ్స్‌ పెట్రాస్‌ ఒక రచనలో.

    ఈ చారిత్రక విషాదానికి ఒకానొక ఉదాహరణ - రంగనాయకమ్మకూ, సి.వి.కీ జరిగిన ఈ వివాదం.

    సమాజంలో ఆర్థిక దోపిడి సమూలంగా నిర్మూలమైన రోజున అన్ని మూఢ విశ్వాసాలూ వాటికవే అతరించి పోతాయని రంగనాయకమ్మగారి అభిప్రాయం. 

    ఆర్థిక దోపిడి అంతరించినా మతమూ, దాని దుష్ప్రభావావాలూ వాటికవిగా నశించవనీ - హేతువాద, నాస్తిక ప్రచారం జరుగుతూ ఉండాల్సిందేననీ సి.వి. గారి వాదం.

    ఒకరు శాశ్వత పరిష్కారాన్ని గురించి చెప్తే, మరొకరు తక్షణ పోరాటాన్ని గురించి మాట్లాడుతున్నారు.

    నిజానికి ఈ రెండు భావనల మధ్యన మౌలికంగా వైరుధ్యమున్నదా? ఒకవేళ ఉన్నప్పటికీ - శుంఠ, కంత్రీ, బుద్ధిహీనత, తలకాయలేనితనం...వంటి మాటలతో దాడులు చేసుకునేంతటి శత్రుస్వభావంతో ఉంటుందా?

    ఒక మార్క్సిస్టుకూ - మార్క్సిస్టూ వ్యతిరేకికీ, ఒక మతోన్మాదికీ - నాస్తికవాదికీ మధ్యన ఇంత పరుషమైన మాటలు దొర్లాయంటే అర్థం చేసుకోవచ్చు.

    కానీ ఈ వివాదంలో పాల్గొన్న వాళ్ళు అలాంటి శత్రుస్థానాల్లోని వ్యక్తులు కాదే! ఈ చర్చ జరిగేనాటికే రంగనాయకమ్మగారు, రామాయణ విషవృక్షం రాశారు. రామాయణం తాలూకు విషప్రభావం నుండి ప్రజలను తప్పించాలన్న లక్ష్యంతో ఆ గ్రంథంలోని పాత్రలనూ, విలువలనూ అతి తీవ్రంగా అవహేళన చేశారు.

    సి.వి.గారు కూడా కేవలం హేతువాద, నాస్తిక ప్రచారోద్యమానికే పరిమితమైన వ్యక్తి కాదు. మార్క్సిస్టు తత్తశాస్త్రం, పారిస్‌ కమ్యూన్‌, లూషన్‌ జీవిత చరిత్ర వంటి ఎన్నో రచనలతో కమ్యూనిస్టు ఉద్యమాలకు చేదోడుగా నిలిచిన రచయిత.- కాత్యాయని, సంపాదకురాలు, చూపు పత్రిక

Write a review

Note: HTML is not translated!
Bad           Good