అది ఆత్రేయ పునర్వసు ఆశ్రమం. అక్కడ విద్యార్థులందరూ ఆయుర్వేద విద్యని నేర్చుకుంటున్నారు. శిష్యులందరికీ థియరీ అయిపోయాక ప్రాక్టికల్‌ క్లాస్‌ కోసం గురువుగారు ఒక పనిచెప్పారు. అదేంటంటే చుట్టూ ఉండే అడవి అంతా గాలించి సాయంత్రంలోగా ఎవరెవరు ఎన్ని ఔషధమొక్కల్ని తీసుకుని రాగలరు అని. ఇంకేం ఉంది, విద్యార్థులందరూ అడవిలో తలో దిక్కూ బయలుదేరారు. సాయంత్రం అయ్యింది. అందరూ గురువుగారి ముందు సమావేశమయ్యారు. సేకరించిన వనమూలికల గురించి వివరిస్తున్నారు పిల్లలు.

    ఆత్రేయుడి దృష్టి బక్క పలుచగా ఉన్న ఒక కుర్రాడిమీద పడింది. అందరి దగ్గరా గుట్టలుగా ఔషధ మొక్కలున్నాయి. ఈ పిల్లాడి ముందు ఏమీ లేవు. ఖాళీ చేతులు. ఇంకేముంది, గురువుగారు ఆ పిల్లాడ్ని లేపి ఔషధ మొక్కలు ఎందుకు తీసుకురాలేదు అని గద్దించాడు. దానికి ఆ పిల్లాడు చెప్పిన సమాధానం ''నానౌషధీ భూతం ద్రవ్యం జగతి న కించిత్‌ అపి విద్యతే'' అని. ''దానర్థం నేను అడవి అంతా తిరిగినా ఔషధం కానిది ఏదీ నాకు కన్పించలేదు.'' అడవిని అంతా నేను మీ దగ్గరికి తీసుకుని రాలేకపోయాను క్షమించండి స్వామీ... ఆ పిల్లవాడే ఆయుర్వేద పితామహుడిగా పేరొందిన చరకుడు.

    సృష్టిలో ప్రతీదీ మందే. మనకి ఓపిక తీరిక ఉండి పరిశీలిస్తే. ప్రతి మొక్కలోనూ ఔషధ గుణాలుంటాయి. ప్రతీ ఔషధం ఏదోక వ్యాధికి పనికొస్తుంది. అది అల్లోపతీ వైద్యంలోనైనా, ఆయుర్వేదంలోనైనా, నేచురోపతీ అయినా, హోమియోపతీ అయినా అన్ని వైద్యశాస్త్రాల్లోనూ, మొక్కల్లో ఉండే ఔషధ గుణాన్ని గుర్తించి వాటిని ఉపయోగించడం ఎప్పట్నుంచో ఉంది. ఈ వైద్య శాస్త్రాలు పురుడు పోసుకోకముందే వనజీవితం గడిపే జాతులవాళ్ళు మొక్కల్లోని మందును ముందు గుర్తించారు....

    లెక్కలేనన్ని మొక్కల్నుంచి కొన్నిటిని మాత్రమే ఈ పుస్తకంలో పేర్కొన్నాను. తర్వాతి పుస్తకాలలో మరిన్నిటిని జత చేరుస్తాను. అలాగే పెరుగుని కూడా ఒక ఔషధంగా చేర్చడం ఆయుర్వేద వైద్యునిగా నా బాధ్యత అన్పించింది. - మాణిక్యేశ్వరరావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good