తెలుగు తల్లికి హాస్యాభిషేకం 'హాస్యకథ - 2010'.
ఎంతోమంది యిటీవలి కాలంలో ఎన్నో కథాసంకలనాలు వెలువరించారు. ముఖ్యంగా తెలుగు కథకు నూరు సంవత్సరాలు నిండిన సందర్భంలో శ్రీ వేదగిరి రాంబాబు గారిని స్ఫూర్తిగా తీసుకుని, కథకు తమవంతు సేవచేస్తూ కథాసంకలనాలను వెలువరించారు కొందరు సాహిత్యసేవకులు.
కానీ మేము గమనించిన విషయము ఏమిటంటే హాస్యకథలను సముచితమైన పద్థతిలో సంకలనాలుగా వెలువరించలేదని. దీనికి కారణం, కథ అంటేనే సీరియసుకథ అన్న అభిప్రాయం బలంగా నాటుకు పోయి ఉండటం కావచ్చు. కథల్లో ఎన్నో రకాలున్నాయి. రసాలను బట్టి వర్గీకరించారు. కరుణారసపూరితమైన దానికి అగ్రతాంబూలం యిచ్చారు. హాస్యకథలను కాలక్షేపపు బఠాణీలుగా చులకనగా చూసారు. కాని ఇక్కడ గుర్తుంచుకోవలసినది ఏమిటంటే, మిగతా అన్ని రకాల కథలలాగే హాస్యకథలు రాయడం కష్టం. నిజం చెప్పాలంటే చక్కటి, చిక్కటి హాస్యంతో కూడిన కథలు రాయడం చాలా కష్టం. ఎవరినీ నొప్పించకుండా గిలిగింతలు పెట్టే హాస్యం రాయడం చాలా చాలా కష్టం.
కాగా తెలుగులో హాస్యరచయితలు కొద్దిమంది మాత్రమే కనిపిస్తున్నారు. ఇప్పుడిప్పుడే చాలా చిత్రాలు హాస్యం మీదే నడుస్తున్నాయి. హాస్యనటులే హీరోలకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. అంతేగాక కామెడీ సీన్లతోనే ఎన్నో టీవీ ఛానెళ్ళు బ్రతికేస్తున్నాయి.
అలా... హాస్యకథల లోటును ఈ 'హాస్యకథ - 2010' పూరిస్తుంది.
- సంపాదకులు