నాకు నచ్చిన కథ
కథా రచనలో నన్ను మించిన వాళ్ళెందరో తెలుగు రచయితల్లో వున్నారని ఏ దాపరికమూ లేకుండానే వొప్పుకుంటాను. అందరినీ మించిన వాడు గురజాడ అప్పారావుగారంటే అందరూ ఒప్పుకుంటారనే నా నమ్మకం. ఆయన కవిగా, నాటక రచయితగా మాత్రమే కాక కథా రచయితగా కూడా చాలా గొప్పవాడు. సంఖ్యలో ఆయన కథలు తక్కువే గాని గుణంలో మాత్రం ఒక్కొక్కటీ ఒక్కొక్క వజ్రపు తునక. అన్నింటిలోకి మిన్నగా నాకు నచ్చిన కథ ''మీ పేరేమిటి?'' అనేది.

దీని పూర్తి పేరు 'దేవుడు చేసిన మనుషుల్లారా! మనుషులు చేసిన దేవుళ్ళారా మీ పేరేమిటీ?'' అని. సుమారు వంద సంవత్సరాల కింద విజయనగరం దగ్గరలోని ఒక కుగ్రామం ఈ కథకి రంగస్థలం. అయినా దీన్ని చదువుతూ ఉంటే ఇందులోని సంఘటనలన్నీ నిన్నగాక మొన్న జరిగినట్లుంటాయి. అన్ని గ్రామాల్లో లాగే ఇక్కడ కూడా రెండు పార్టీలుంటాయి. అయితే అవి మతానికి సంబంధించినవి. ఇందులోని అనేకానేక మహద్గుణాలలో గురజాడ మహత్తర కథన కౌశలం ఎంతో ఆశ్చర్యకరమైనది మాత్రం ఇక్కడ చెప్పదలచుకున్నాను. ''కన్యాశుల్కం'' లోని నాటకీయత కూడా ఈ  కథలో సమృద్ధిగా దొరుకుతుంది. ఇందలి పాత్రలన్నీ ''కన్యాశుల్కం'' నాటకంలోని పాత్రలలాగే సజీవమైనవి. ఇందలి సంఘటనలన్నీ కథ చదువుతున్నంతసేపూ మన కళ్ళ యెదుట కట్టినట్టుగా కనిపిస్తాయి. అక్కడే ఉంది గురజాడ గొప్పతనం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good