స్త్రీల లైంగికత్వం మీద అంతులేని అధికారం ఉందనుకునే పితృస్వామ్యపు పునాదిపై లేచిన రాజ్యంలో ఈ హింస కొత్తకొత్త రూపాలను ధరిస్తోంది. దీనికి పరిష్కారం ఏమిటనే ప్రశ్న ఇవాళ స్త్రీలందరినీ వేధిస్తోంది. 'పూర్నమ్మ'లు 'కన్యక'లు మళ్ళీ మళ్ళీ ప్రాణాలు అర్పించాల్సిందేనా? లేదంటే ఏం చెయ్యాలి. స్త్రీలు తమ లైంగికత్వం చుట్టూ అల్లుకున్న అక్రమ, సక్రమ, శీల, అశ్లీల భావజాలపు మాయపొరలన్నీ ఛేదించబడాలి. స్త్రీలు చరిత్ర పరిణామక్రమంలో తాము కోల్పోయిన తల్లి హక్కును తిరిగి పొందగలగాలి. చరిత్రను గురజాడ చెప్పినట్లు పునర్లిఖించాలి. అధికారం అంటే పీడన, దోపిడి, అణచివేత అనే అర్థాలను మార్చి శాంతి, సహకారం, పరస్పర ప్రేమ, అంగీకారంతో కూడిన లైంగిక సంబంధాలు అనే అర్థాన్ని స్త్రీలు పూనుకొని కల్పించాలి. బాలికలకు, పిల్లలకు, స్త్రీలకూ, ఏ హక్కులూ, అధికారాలు లేని, ఏ భద్రతా కల్పించలేని కుటుంబ వ్యవస్థ సమూలంగా మారాలి. ఇంత జరగాలంటే స్త్రీలు పితృస్వామ్యపు అణచివేతను గుర్తించి దానిపై యుద్ధానికి సిద్ధమవాలి. ఆ యుద్ధం ద్వారా తమ మీద తాము అధికారాన్ని పొందగలగాలి. గురజాడ వందేళ్ళ క్రితం రాసిన 'కన్యక' 'పూర్నమ్మ' కథాకావ్యాల సాహిత్య రాజకీయ ప్రయోజనం ఇదే!

Write a review

Note: HTML is not translated!
Bad           Good