అచ్చ తెనుగు నుడికారం రుచి చూపించిన మహాకవి తిక్కన పురిటిగడ్డ గుంటూరు. బౌద్ధధర్మం తొలి అడుగులు వేసింది ఈ అమరావతి సీమలోనే. కొండవీటి వైభవచరిత్ర యిక్కడిదే.

సాహిత్య సాంస్కృతిక కళాదీపాలు వెలిగించిన మహామహులెందరో యిక్కడ నడయాడారు. నడయాడుతున్నారు. అన్ని రంగాలతో పాటు సాహిత్య రంగంలోనూ గుంటూరుసీమ తెలుగునాట అగ్రగామిగా నిలిచింది. సాహిత్య ప్రక్రియలలో మరీ ముఖ్యంగా కథాప్రక్రియలో గుంటూరుసీమది ప్రత్యేకించి చెప్పుకోదగిన విలక్షణ స్థానం. తొలి కథాకాంతులను అందుకోవటంతో పాటు కథావిమర్శ, అనువాద కథలను తెలుగువారికి మొదటిసారిగా పరిచయం చేసింది గుంటూరుసీమ ఆసి అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు. ఇంతమంది కథకులు ఒక్క జిల్లాలోనే ఉండటం సాధ్యమా అని ఆశ్చర్యపోయే రీతిలో దాదాపు నాలుగువందల మంది కథకులు, అందునా తెలుగు కథను విద్యుత్తేజంతో వికసింపజేసిన పలువురు ప్రసిద్ధులు ఈ సీమవారే కావటం ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ఒక విశిష్ట విషయం.

కథానికా చరిత్రను ఉద్యమస్థాయిలో నిర్మించిన గుంటూరు కథకు ఇప్పుడు వందేళ్లు. కథనే కాదు సకల సాహిత్యప్రక్రియలనూ ప్రభావితం చేసి సాహిత్యాన్ని ప్రజాపక్షం చేసిన అభ్యుదయ రచయితల సంఘం సరిగ్గా 70 ఏళ్ల క్రితం ఆవిర్భవించిదీ గుంటూరు సీమలోనే. ఈ సందర్భంగా అరసం-గుంటూరు జిల్లా శాఖ మూడు తరాల కథారచయితల 70 కథల సంకలనాన్ని పాఠకలోకానికి ప్రేమతో సమర్పిస్తోంది.

గుంటూరుసీమ ఆత్మతోపాటు తెలుగుజాతి హృదయాన్ని ఆవిష్కరించే ఈ కథాసంకలనానిది ఇరవయ్యొకటో శతాబ్ది కథాసంకలనాల చరిత్రలోనే ఓ సుస్థిర స్థానం.

Pages : 867

Write a review

Note: HTML is not translated!
Bad           Good