ఏ కారణం చేతనో కాని, తెలుగు కవిత్వంలో హాస్యరసానికి పూర్వం ఎక్కువ స్థానం లేకపోయింది. ఇప్పుడు కొద్దిగా వచ్చినా, అదియింకా ప్రధాన స్రవంతిలో స్థానం పొందలేక పోతోంది. హిందీ మొదలైన భాషల్లో హాస్యకవి సమ్మేళనాలు చాలా జనప్రియంగా సాగుతై. అన్ని రసాల్లో ఒకటిగా, హాస్యానికి గొప్ప స్థానం అలంకార శాస్త్రజ్ఞులిచ్చినా, అది యింకా మొదటి వరుసలో లేదు. హాస్యం, కేవలం ఏదో విధంగా నవ్వు పుట్టిస్తే, అందులో వస్తువుకీ, భావనకీ ఏ ప్రాముఖ్యమూ ఉండక పోవచ్చు. కాని, అది వ్యంగ్యం, వేళాకోళం మొదలైన వాటిలో కలిసి ఉంటే, ప్రయోజనం చాలా అధికంగా ఉంటుంది. ఈనాటి సామాజిక రాజకీయ వాతావరణాన్ని చూస్తే, ఎవరికైనా వ్యంగ్యంగా చెప్పాలనే స్ఫూర్తి కలుగుతుంది. అదే, కవిత్వంలో చెప్తే, దానికి యింకా బలం వస్తుంది. వ్యంగ్యంతో కూడిన కవిత్వాన్ని బలంగా చెప్తూ,  ప్రయోజనం సాధిస్తున్న వారిలో గిరి ఇంటూరి ఒకరు.  ఆయన రాసిన 'గులాబీలు'లోని కవితలన్నీ ఏదో ఒక విధమైన హాస్యపూరిత వ్యంగ్యంతో ఆకట్టుకుంటై. ''గులాబీలు' అనే పేరు కూడా సార్థకంగా ఉంది. గులాబీ చాలా మెత్తగా ఉంటుంది. కాని, పక్కనే ముళ్ళుంటై. అందువలన మెత్తగా తగుల్తూనే, గట్టిగా గుచ్చుకునేది వ్యంగ్యం. ఈ వ్యంగ్యాన్ని సాధించడానికి చాలా రీతుల్ని అనుసరించారు గిరి.

    ఈ సంపుటిలోని కవితలన్నింటిలో అతి సామాన్య ప్రజల వాడుక భాష, ముఖ్యంగా సంభాషణరీతి, అందులోని అనేక కాకువులు. (ఉచ్చారణ భేదం వల్ల భావం ధ్వనించే విధానం), ప్రచురంగా కనిపిస్తై. ఉదాహరణకి 'కల్తీ నై చల్తీ' అనే కవిత ఉంది.

    'పెట్రోల్‌లో కిరోసిన్‌ కల్తీ

    దీన్లో ఇదీ, దాన్లో అదీ గల్తీ

    వేశార్ట కల్తీ పై వేటు

    చేశార్ట సమంగా రేటు

    అసలెంతో నకిలీ అంత

    ఇప్పుడు పెట్రోలెంతో కిరోసినూ అంతే

    కల్తీ ! ... గాయబ్‌ ... పోయిందే !!!'

Write a review

Note: HTML is not translated!
Bad           Good