సనాతన భారతీయ సంస్కృతిలో గోవు ఓ అంతర్బాగమన్నది అందరికీ తెలిసిన సంగతే! పవిత్రతలోగాని, పనికొచ్చే అంశాల్లోగాని కామధేనువుతో సాటిరాగల ఏకైక జీవి - ఇలలో గోవు మాత్రమే!
వేద పురాణ శాస్త్రాదులన్నీ శ్లాఘించిన గోమాత గొప్పతనం నేడు పెనుముప్పులో పడిందన్న విషయం విని, ధార్మిక జీవనులందరూ ముక్తకంఠంతో ఈ విపత్కర పరిస్థితి ఖండిస్తున్నారు. గోమాత ఉనికిని కాపాడటానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
కేవలం పూజార్హమైన జీవిగా గోవును అవసరార్థం చూస్తే చాలదు. దాని మనుగడకు వాటిల్లే విపత్కర పరిణామాలనుంచి దాన్ని రక్షించాలి. గోసంతతిని వృద్ధి చెందించడానికి అవసరమైన వనరులన్నీ సమీకరించ గలగాలి. ఒక్క మాటలో చెప్పాలంటే గోవును ఆరాధించే - ప్రేమించే వారంతా గో సంపదవృద్ధికి తమ వంతు సహకారాన్ని అందజేయగల్గాలి.
ఆవుని తల్లితో పోలుస్తారు. తల్లి పురిట్లోనే మరణిస్తే, ఆ పసిబిడ్డకి ఆవుపాలు పోస్తారు. ఆవుపాలు పోస్తే బిడ్డ బతికి బట్టకడుతుందనే నమ్మకం. కేవలం నమ్మకమే కాదు నిజం. ఇది మూఢభక్తితో చెప్పేమాట కాదు. శాస్త్రీయంగా నిరూపించబడిన సత్యం. అయితే ఆవుని తల్లితో పోల్చటానికి, ఆవుపాలు శ్రేష్ఠం అనటానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం.