సినిమాకి సంగీతం ముఖ్యం. పాటలు పాడడం, సహజత్వానికి భిన్నం అని చెప్పినవాళ్ళు పాటల్లేకుండా సినిమాలు తీసినా, వాటిలో నేపథ్య సంగీతమైనా ఉంటుంది. ఇక్కడ దృశ్యం జరుగుతూ వుంటే, వెనకాల వాద్యగోష్టి వినిపించడం మాత్రం అసహజం కాదా? కాదనిపించదు - ఎలాంటి సినిమాతోనైనా, సంగీతం ముడిపెట్టుకుంటుంది గనుక. అందుకే పాట రానివాళ్లు నటులైనా, వాళ్ళకు 'వెనక పాట' (ప్లేబాక్) పెట్టి 'సంగీతం ముఖ్యం' అనిపించేదే కాని, సినిమా వదిలిపెట్టేయలేదు. అంతటి ప్రాముఖ్యతకి, ముఖ్యత ఇస్తూ పాడిన తారల గురించి, పాత్రలు ధరించకపోయినా పాటలు పాడినవారి గురించి - మిత్రులు కె.రవిచంద్రన్ 'జ్ఞాపకాలు' ('ఆంధ్రజ్యోతి'లో వచ్చినవి) పేరిట ఈ పుస్తకం వేశారు. ఈ 'జ్ఞాపకాలు' ఎవరికి వాళ్లుగా చెప్పినవి. వివిధ గాయకులు, నట గాయకులు చెప్పిన చాలా విషయాలవల్ల ''సినిమా సంగీత చరిత్ర'' కొంతవరకూ అవగాహన అవుతుంది. నేపథ్యగాన విధానం అమల్లోకి వచ్చిన తర్వాత నేపథ్యగాయకులు కూడా తారలంత పేరు, గ్లామరూ తెచ్చుకున్నారు. నటీనటులకు (ఒకరిద్దరు మినహాయిస్తే) లేని విగ్రహారాధనను - ఒక్క ఘంటసాలగారు లాంటి నేపథ్యగాయకుడు పొందగలిగారంటే - నేపథ్యగానానికి వున్న ప్రసిద్ధి, ప్రాముఖ్యతా అర్ధమవుతాయి. సినిమాలు వున్నంతవరకూ సంగీతానికి, నేపథ్యగానానికీ ఏం ఢోకా లేదు! అందుకు ఊత ఈ పుస్తకం. - రావి కొండలరావు |