లిటరరీ సెటైర్‌' శక్తివంతమైన కళారూపం. దానిని కందుకూరి, గురజాడలు మనకందించిపోయారు. దానిని మనం కొనసాగించలేకపోయాం. ప్రత్యక్ష విమర్శనాత్మక పద్ధతికి అలవాటుపడిపోయాం. ఈ సందర్భంలో 'చాకిరేవు' చదవటం కొత్త అనుభూతినిస్తుంది. ఈ అధిక్షేపం మార్మిక వాస్తవికత కన్నా భిన్నంగా ఉంటూ, ఆసక్తికరంగా ఉంటుంది.
గురజాడ తర్వాత, దారితప్పిన తెలుగు సాహిత్య పయనం మీద గురజాడ సృష్టి అయిన గిరీశం వాగ్ధోరణితో వ్యంగ్యబాణాలు విసరడంలో రచయిత సఫలమయ్యారు. ఇవాళ టి.వి. యాంకర్ల సంకరభాష వంటిదికాదు 'చాకిరేవు' భాష - దానికొక ప్రత్యేక స్వభావం ఉంది. ఆ భాషకొక సామాజిక లక్ష్యముంది. అది సంఘ సంస్కరణ. గురజాడకు - అభ్యుదయ సాహిత్యానికీ మధ్య కాలంలోని తెలుగు సాహిత్య వాతావరణం మీద అధిక్షేపాత్మక విమర్శ 'చాకిరేవు'. సాహితీలోకంలో కూడా ప్రతిపక్షపాత్రను ఎంత నాగరికంగా పోషించవచ్చునో ఈ రచన నేర్పిస్తుంది. ఈ రచన నుంచి ఇవాళ 'మన కలం వీరులు' నేర్చుకోవలసిన వ్యంగ్యముంది. ఆరోగ్యకరమైన విమర్శా విధానముంది. ఈ అరుదైన గ్రంథాన్ని గుర్తించి 'విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌' వారు ప్రచురించడం అభినందించదగిన విషయం.
- రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good