నగర జీవిత విధానంమీద సంచార జీవిత విధాన ఆధిక్యత జెంఘిజ్‌ ఖాన్‌ చూపించదలచుకున్నాడు. తాము జయించిన ప్రాంతాల నుంచి కప్పం రాబట్టుకుంటూ తాము పచ్చికబీళ్ల మీదనే వుండాలని అనుకున్నాడు. వ్యవస్థాపరంగా యెక్కువ అభివృద్ధి చెందిన నగర నాగరికత వున్నప్పుడు జెంఘిజ్‌ ఖాన్‌ చేసినలాంటి ప్రయత్నాలు నెరవేరవు.

    జెంఘిజ్‌ ఖాన్‌ నిరక్షరాస్యుడు. అసలు లిపి అనేది ఒకటి వుందని కూడా తెలీదు. అంచేత నోటి మాటగానే దౌత్యాలు, ఆజ్ఞలు, వ్యవహారాలు నడిచేవి. కాని లిపి అనేది ఒకటి వుందని తెలిశాక దాని విలువని గుర్తించాడు జెంఘిజ్‌ ఖాన్‌. దాన్ని వాడుకోవడానికి యేర్పాట్లు చేశాడు.

    జెంఘిజ్‌ ఖాన్‌ యేదో అనాగరిక తండాలో మహాతెలివైన వాడవడం మూలంగానే ప్రపంచాన్ని గజగజలాడించే దండయాత్రలు చేశాడని కాదు. తండా రాజకీయాల్లో మహానేర్పరి. ఆ అంతరంగిక దౌత్యనీతి బాగా తెలిసిన వాడు.

    జెంఘిజ్‌ ఖాన్‌ని వ్యక్తిగా పరస్పర విరుద్ధ అంచనాలు వేశారు. నెహ్రూగారి లాంటివాడు ''దిస్‌ మ్యాన్‌ ఫాసినేట్స్‌ మీ'' అన్నాడు. ఏడువందల సంవత్సరాల తర్వాత, ''దేవుడి శాపం''గా వచ్చిన వాడని పర్షియన్లు, తురుష్కులు, పాశ్చాత్య చరిత్రకారులు ''కీర్తించిన'' జెంఘిజ్‌ ఖాన్‌కి నెహ్రూగారు చాలా గౌరవం యిచ్చారు.

    ఎన్ని పరస్పర విరుద్ధ అభిప్రాయాలు యెంతమంది వ్యక్తం చేసినా జెంఘిజ్‌ ఖాన్‌ మహావీరుడన్న విషయాన్ని యెవళ్లూ విస్మరించలేదు. అలాంటి వాడు మంగోలుల మహానేత జెంఘిజ్‌ ఖాన్‌.

Write a review

Note: HTML is not translated!
Bad           Good