''గౌతమ బుద్ధుని అనంతరం భారతదేశంలో ఇంతటి మహావ్యక్తి జన్మించలేదు. జీసస్‌ క్రీస్తు అనంతరం ప్రపంచం ఇంతటి మహనీయుడ్ని చూడలేదు'' అని రెవరెండ్‌ డాక్టర్‌ జె.హెచ్‌.హూమ్సు అను అమెరికన్‌ మిషనరీ మహాత్మాగాంధీని ప్రస్తుతిస్తే, ప్రపంచ ప్రఖ్యాత వైజ్ఞానిక శాస్త్రవేత్త ఐనస్టీన్‌ ''మహాత్మాగాంధీ వంటి వ్యక్తి ఈ భూప్రపంచంమీద రక్తమాంసాలు గల శరీరంతో మనుగడ సాగించారంటే ముందు తరాల వారు నమ్మలేక పోవచ్చును'' అని వ్యాఖ్యానించారు.

    అతి సామాన్యుడైన మోహన్‌దాస్‌ అసామాన్యుడై తన జీవిత కాలంలో మహాత్ముడనిపించుకోవడం ఎలా సాధ్యమైంది? శ్రీ యు.ఆర్‌.రావు రచించిన గాంధీజీ జీవిత విశేషాలు చదివితే మనకు అర్థమవుతుంది. ''నా జీవితమే నా సందేశం'' అన్నారు మహాత్మాగాంధీ. గాంధీ జీవితంలోని అద్భుత ఘట్టాలను తీసుకుని సరళమైన భాషలో సులభంగా అర్థమయ్యేలా శ్రీ యు.ఆర్‌.రావు రచన సాగింది.

    సమస్త జనుల యోగక్షేమాల కోసం - తదేక దీక్షతో కృషి చేశాడు కనుక గాంధీజీ మహాత్ముడని పూజలందుకున్నారు.

    గాంధీజీ సిద్ధాంతాన్ని ప్రకటించడమే కాదు. వాటిని స్వయంగా ఆచరించి చూపాడు. గాంధీజీ ప్రతిపాదించిన జీవిత విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన జీవితం, బోధ రెండూ తోడ్పడతాయని శ్రీ యు.ఆర్‌.రావు రచించిన ఈ పుస్తకం తేటతెల్లం చేసింది.

    ''మన ముందు ఉదాత్తమమైన జీవిత లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యసాధనకు అనుసరించే సాధనాలు కూడా పవిత్రమైనవిగా ఉండాలి'' అని బాపూజీ మనకు బోధించాడు. మహాత్ముని జీవితం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం. మన జీవితాలను ఆదర్శవంతంగా రూపొందించుకోవడానికి ఆ మహా మహితాత్మునికి తగిన వారసులుగా రూపొందడానికి ఈ గ్రంథం మనకు ఒక మార్గదర్శి. - మండలి బుద్ధప్రసాద్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good