తమిళనాడులో ఎక్కడ చూచినా వినాయకుడి గుడి కన్పిస్తుంది. స్వామిని పిళ్లైయార్ అని తమిళులు పిలుస్తారు. పెద్ద పెద్ద గుళ్ళు, గోపురాలు లేకపోయినా ఏ రావిచెట్టు క్రిందో మనకు స్వామి సాక్షాత్కరిస్తాడు. చాలాచోట్ల పందిళ్లు కూడా ఉండవు. స్వామికి ఆకాశమే పందిరి. ఇంచుమించు ప్రతి గ్రామంలోనూ, అంతే కాదు, ప్రతి వీధిలోనూ అడుగడుగునా తమిళనాడులో స్వామి సాక్షాత్కరిస్తాడు. సంఖ్యలో ఇతని తరువాతనే మిగతా దేవతల విగ్రహాలు. ఇతడు పార్వతీ పరమేశ్వరుల ప్రథమ సంతానం. తమిళంలో కొడుకుని పిళ్లై అని అంటారు. గౌరవంతో బహువచంన ప్రయోగించినపుడు పిళ్లైయార్ అంటారు.
వినాయకుని తమ్ముడే కుమారస్వామి! కాని పిళ్లైయార్ అన్నట్లుగా గౌరవ సూచకంగా బహువచనం వాడి కుమారర్ అని పిలువరు కుమారన్ అనే పిలుస్తారు. ఇతని కంటే పెద్దవాడు కనుక వినాయకుని పిళ్లైయార్ అంటారు.
ఇట్లా జగత్పితరులైన పార్వతీ పరమేశ్వరులకు మొదట పుట్టినవాడై, దేవుడై నుతింపబడ్డాడు. కనుక ప్రతి దానికి ఇతడు మొదలైనడు. ప్రపంచం జీవులు అన్నీ ప్రణవం నుండి వచ్చాయి కదా! అట్టి ప్రణవానికి కనబడే రుపమే మన స్వామి. అతని ఏనుగు తల, వంకర తిరిగిన తుండం చూస్తూ ఉంటే ప్రణవాకారంగానే కన్పిస్తాడు.