'ఒక చిన్న సలహా...'' అంది లావణ్య.
''చెప్పండి''
''అందరూ ఎన్నో కొన్ని అబద్ధాలు చెప్తూనే వుంటారు. ఇద్దరి మధ్య ఎక్కువ అబద్ధాలు వారి మొదటి పరిచయంలో దొర్లుతాయి. ఎందుకంటే అప్పుడు వారిద్దరూ ఒకరికొకరు తాము అన్ని విధాలా అత్యంత మంచివారమని, ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారమని తెలుపుకొనే ప్రయత్నం చేస్తారు. అలాంటి సందర్భాల్లో శత్రువులు మాత్రమే పచ్చినిజాలు మాట్లాడుకొంటారు. ప్రేమికులు ఒకరినొకరు ఇంప్రెస్ చేయడనికి అబద్ధాల మీద అబద్ధాలు అలా జీవితకాలం చెప్పుకుంటూనే వుంటారు. అందువలన మీరు పెళ్ళికి సిద్ధపడే ముందు అతనిని ఏ కారణం వలన మొదటి భార్యకి దూరమయ్యాడో అడగండి. అతని జవాబుని గుడ్డిగా నమ్మేయకుండా అతని పరిచయస్తులని, స్నేహితులని అడిగి సరైన కారణం తెలుసుకోండి. అది మీకే మంచిది. ఏ స్త్రీ కూడా తన కాపురాన్ని చేజేతులా పాడుచేసుకోదు. అందువలన అతని ఇంటివద్ద, మొదటి భార్య ఇంటి వద్ద కూడా విచారించి అసలు కారణం తెలుసుకోండి. ఆ తర్వాత మాత్రమే అతనిని పెళ్ళి చేసుకొనేది లేనిది నిర్ణయించుకోండి'' అంది లావణ్య.
''థాంక్యూ మేడమ్'' అని చెప్పి వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళిపోయిన వెంటనే లావణ్య కిషోర్ని పిలిచి ''ఈ అమ్మాయిని ఫాలో అయ్యి పూర్తి పేరు, ఉద్యోగం వివరాలు కనుక్కో'' అని చెప్పింది.
''ఆ అమ్మాయి తన పేరు లయ అని, ఏదో స్కూల్లో టీచరుగా పనిచేస్తున్నానని చెప్పిందిగా?!'' ఆశ్చర్యంగా అడిగాడు కిషోర్, లావణ్య చెప్పేది వింటూ.
''ఆ అమ్మాయి తన పేరు, ఉద్యోగం వివరాలు మార్చి చెప్పిందని నా నమ్మకం. నువ్వు తొందరగా బయల్దేరు. లేకపోతే ఆమెని మిస్ అవుతావు''
''అలాగే మేడమ్'' అని కిషోర్ వేగంగా బయల్దేరాడు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good