ఏకాంత సేవ చేసినవారు ఒకరు కాదు. జంటకవులు. వేంకట పార్వతీశ్వర కవులనే పేరుతో విరాజిల్లినవారు. ఒకరు బాలాంత్రపు వేంకటరావుగారు. మరొకరు ఓలేటి పార్వతీశంగారు.
కొత్తతలుపులు తెరిచిన కావ్యం - వాడ్రేవు చినవీరభద్రుడు
బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం అనే ఇద్దరు కవులు వేంకటపార్వతీశ్వర కవులు పేరిట 1922లో వెలువరించిన 'ఏకాంతసేవ' ఆధునిక తెలుగు కవిత్వానికి కొత్త తలుపులు తెరిచిన కావ్యం. ఆ కావ్యానికి ముందుమాట రాస్తూ, కృష్ణశాస్త్రి-
'ఆంధ్ర సారస్వత చరిత్రలో ఒక నూతన శకము ప్రారంభమైనది,
కవులు బయలు దేరినారు. ప్రాతకవుల వంటివారు కారు.
గానమొనర్చుచున్నారు. వెనుకటివారి వలె గాదు. విషక్ష్మీములో మార్పు,
రీతిలో మార్పు, స్వరములో మార్పు.'
అని రాసారు. 'ఏకాంతసేవ' కావ్యానికి అటువంటి చారిత్రక ప్రాధాన్యత, వస్తు ప్రాధాన్యత, శిల్ప ప్రాధాన్యత ఉన్నాయి.
వేంకట పార్వతీశ్వర యుగం :
ముందు చారిత్రక ప్రాధాన్యత చూద్దాం. ఇరవయ్యవ శతాబ్ది తెలుగు కవిత్వం వికసించిన క్రమం గురించి సాహిత్యవిమర్శకులు ఒక కథనం రూపొందించారు. ఆ కథనం ప్రకారం ఆధునిక తెలుగు కవిత్వానికి గురజాడ, రాయప్రోలు వైతాళికులు, ముఖ్యంగా రాయప్రోలు సుబ్బారావు కవిత్వమే భావకవిత్వానికి స్ఫూర్తి అని చెప్పారు. కాని రాయప్రోలు తమని నేరుగా ప్రభావితం చేసాడని కృష్ణశాస్త్రిగాని, విశ్వనాథ గాని ఎక్కడా అనలేదు. తరువాతి రోజుల్లో శ్రీ శ్రీ గురజాడ తన మీద గాఢమైన ప్రభావం చూపించాడని చెప్తూ, అబ్బూరి రామకృష్ణారావుని కూడా తన మార్గదర్శకుల్లో ఒకరిగా పేర్కొన్నాడు. రాయప్రోలు తనని పరోక్షంగా మాత్రమే ప్రభావితం చేసాడని చెప్పుకున్నాడు.
పేజీలు : 118