ఈసప్‌ కథల్ని నీతికథలు అనడం సమంజసమే. ఏదో యధార్థాన్ని ధరించి ఉండని కథే లేదు. ప్రతీ కథకీ చివర ఆ కథ వల్ల నేర్చుకోదగ్గ నీతి ఏమిటో కథకుడే అనేస్తే తీరిపోతుందని కొందరు నమ్మవచ్చు. నాకు అటువంటి నమ్మకం లేదు. నీతి చెప్పవలసింది కథే గాని కథకుడు కాడు. శ్రోతగాని చదువరిగాని కథానందంలో ఉంటూన్న సమయంలో, నీతిబోధ యొక్క వాసన కొట్టకుండా ఉండడమే నయంఅని నా విశ్వాసం.
ఉద్దేశింపబడ్డ విషయాలన్నీ మానవ వ్యాపారాలే అయినా, ఒక్కొక్కప్పుడు మానవేతర ప్రమేయాల మీద కర్తవ్యం
ఉంచడంలో రచయిత చాకచక్యం చూపించాడు. జంతు లక్షణాలన్నీ మానవుడిలో ఉన్నాయి. వాటి దుర్లక్షణాలకి అతీతుడు కావడమే మానవత్వమనిన్నీ, వాటి సల్లక్షణాలు కూడా మానవుడి దగ్గర లేకపోవడం మానవుడి అధమాధమత్వమనిన్నీ, రచయిత సూచన. కాని, అట్లా సూటిగా అనేస్తే ఉండగల చిక్కులు తొలగించుగునేటందుకు, ఒక్కొక్క మానవలక్షణానికి ఒక్కొక్క జంతువుని పాత్రగాచేసి మాట్లాడించాడు. అనగా - సింహం రాజత్వం, తోడేలు క్రౌర్యం, నక్క కాపట్యం, గాడిద మూర్ఖత్వం, కుక్క విశ్వాసం, పిల్లి స్వార్థ జ్ఞానం, ఎలుక చాటు వ్యాపారం, ఎద్దు కాయకష్టం, గుర్రం ఠీవి, మేక అమాయికత్వం, లేడి పిరికివేగం, ఒంటె మోత, తాబేలు మాంద్యం - మొదలైన ప్రవృత్తులు కలిగి ఉన్నట్లు ఊహించి కథాకల్పన చేశాడు. వాట్లకి సంభాషణలు జరిగాయన్నాడు. కాని, ఎంత హృద్యంగా రచించాడంటే, ఆయా  జంతువులకి మాటలు వచ్చునా? అవి నిజంగా మాట్లాడుకున్నాయా? అని, బాలబాలికలు కాదు ప్రాజ్ఞులు కూడా మరచిపోయేటంతగా!
ఈసప్‌ కథలు తెలియకపోవడం మానవత్వానికి లోటు. కథా సందర్భానికి అవసరమైన పదం తప్ప వాడలేదు. ఎవరైనా సరే ఆరగించవచ్చు. - భమిడిపాటి కామేశ్వరరావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good