ఒసామా హత్య గురించి, ఒబామా నైతిక పతనం గురించి, అన్నాహజారే ఉద్యమం గురించి, అంతర్జాతీయ ద్రవ్యనిధి అధ్యక్షుడి అసభ్య అత్యాచార వర్తనను బైటపెట్టిన ఆ నల్ల యువతి సాహసం గురించి రాసిన వ్యాసాలు మాకు తృప్తినిచ్చాయి. అసలు ఈ కాలమ్ మరీ సీరియస్గా కాకుండా హాస్య, వ్యంగ్య ధోరణిలో రాయాలనుకున్నాం. అలాగే రాశాం. మీరెంత హాస్యంగా రాద్దామనుకున్నా రాజకీయ పదును కనపడుతూనే ఉంది అన్నారు ఎందరో పాఠకులు. ఇప్పుడవి పుస్తకంగా వస్తున్నాయి.
ఈ కాలమ్లో మేం రాసిన విషయాలన్నీ ముఖ్యమైన రాజకీయ అంశాలే. వాటికి ఇప్పట్లో కాలం చెల్లే అవకాశం కనపడటం లేదు. మళ్ళీ, మళ్ళీ అవే సంఘటనలు, అవే ధోరణలు కొనసాగుతున్నాయి. అసమానత్వం, ఆధిపత్యం, హింస, అత్యాచారం, అవినీతి, దోపిడి, మూఢత్వం యివి కొనసాగుతున్న రోజుల్లో ఆయా అంశాల గురించి మేంచేసిన వ్యాఖ్యలు, విశ్లేషణలు ఒక రాజకీయ దృష్టికోణాన్ని సమస్యలలోతు గురించిన అవగాహనను కలిగిస్తాయనే ఉద్దేశంతోనే 'ఈ కాలమ్' ను పుస్తకంగా తెస్తున్నాం.
ఓల్గా & వసంత కన్నబిరాన్