తల్లిదండ్రులు నిర్దయులైతే, మూర్ఖులైతే, జాగ్రత్తలు పడవలసింది ఎవరు? - ఇంకెవరు? వాళ్ళ చేతుల్లో చిక్కి వున్న పిల్లలే.

ఎదిగే పిల్లలే రేపు కొత్త తల్లిదండ్రులవుతారు.

చిన్నతనంలో, తమ తల్లిదండ్రుల వల్ల అవమానాలు పడ్డ పిల్లలు కొందరు, తామే తల్లిదండ్రులయ్యాక, తాము అనుభవించిన అవమానాలన్నీ తమ పిల్లలు కూడా పడవలసిందే అనుకుంటారు! ''మా రోజుల్లో మేం పడలేదా? మా పెద్ద వాళ్ళు మమ్మల్ని అలా చెయ్యలేదా?'' అంటారు.

పెద్ద వాళ్ళు ఏ తప్పు చేస్తే అదే ఘన కార్యం కాదు. ఒక తరం వాళ్ళు చేసిన తప్పులు, ఇంకో తరం ద్వారా కూడా జరగకూడదు. అవి, రెండో తరంలో ఆగిపోవాలి.

దొంగ తల్లిదండ్రులూ, దొంగ అత్త మామలూ, పాత కాలం నించీ వున్నారు. ''సతీ సహగమనాల'' ముచ్చట్లు నిర్వహించిన వాళ్ళందరూ తల్లిదండ్రులూ, అత్తమామలూ, కారూ?

ఈనాడు కూడా 'పరువు హత్యల' పేరుతో ఆడ పిల్లల్ని నరికి వేసేది తల్లిదండ్రులు కారూ?

పిల్లలు, హిమాలయ పర్వతాలెక్కే ఘన కార్యాలు చేసి డబ్బు సంపాదించా లనీ పిల్లలు అక్కడ కొండల మధ్య రాలిపడి చచ్చినా, కొంత డబ్బు వస్తే చాలనీ చూసే తల్లిదండ్రులు కూడా, తల్లిదండ్రులు కారూ? కొండ లెక్కడంలో బోలెడు మంది పడిపోతున్నారనీ, చస్తున్నారనీ, తెలీదూ? - తెలుసు! కానీ, డబ్బు రావాలి. పిల్లలు పోతే పోతారు! - వాళ్ళే మరి తల్లిదండ్రులు!

ప్రతీ తల్లీ, ప్రతీ తండ్రీ, దొంగలు గానే ప్రవర్తిస్తారని చెప్పడమా ఇది? - కాదు. అలా చెప్పడం అయితే, నేనూ ఒక 'దొంగ తల్లి'నే అవుతాను. ప్రతీ ఒక్కరి గురించీ అదే అర్ధంతో చెప్పడం కాదు ఇది.

దొంగ తల్లిదండ్రుల పిల్లలు, తమ అవమానాలన్నీ ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. పెద్ద వాళ్ళయ్యాక, దేన్ని సహించాలో, దేన్ని తిరస్కరించాలో, ఆ రకంగా నడవాలి. తమ ప్రవర్తనలోకి కౄర లక్షణాలు చేరనివ్వకుండా తమని తాము దృఢ పరచుకోవాలి. - ఇదే, కొత్త తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్త!

Write a review

Note: HTML is not translated!
Bad           Good