దివ్యజ్ఞాన సమాజం ఏంచేస్తూంది?
అవినీతి అక్రమాలు ప్రపంచం నలుమూలల్లో ప్రబలిపోయాయి. మంచితనానికి నిజాయితీకి విలువలేదు. మొత్తం వాతావరణం కలుషితమై పోయింది. విద్వేషాలు విధ్వంసన క్రియలు మితిమీరిపోయాయి. ఇట్లాంటి పరిస్థితులు బాగుపడాలంటే మరొక్కసారి భగవంతుడు అవతారమెత్తి రావలసి వుంటుందేమోనని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో దివ్యజ్ఞాన సమాజం ఏంచేయాలి? ఏం చేస్తూంది?
ఈ పరిస్థితుల్లోంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరు ఆత్మ పరీక్ష చేసుకోవాలి. లోతుగా ఆలోచించాలి. ఈ పరిస్థితులు ఏర్పడ్డానికి కారణమేమో యోచించాలి.
జనాభా పెరగటం, దానికి తగ్గట్లుగా ఉత్పత్తి పెరగకపోవడం, అందువల్ల ధరలు పెరుగుతున్నాయి. సామాన్య జీవితం దుర్భరమవుతున్నది. స్థిమితంగా ఉండేదానికి, నెమ్మదిగా ఆలోచించేదానికి సగటు మనిషికి సాధ్యం కావడం లేదు. నిదురలేచినప్పటినుంచి ఒకటే ఉరుకులు, పరుగులు. దీనికితోడు సుఖాపేక్ష, కోరికలు పెరుగుతున్నాయి. స్వార్థం పెల్లుపెరిగింది.
అన్ని అనర్థాలకు కారణం దేహాభిమానమే. ప్రతి మానవుడు భగవదంశే. ఈ అంశలన్నీ తరతమ బేధంతో ముందువెనకల పరిణామాన్ని పొందుతున్నాయి. ఈకారణం చేత మానవులందరూ సోదరులే, అనే విషయాన్ని విస్మరించి తాను వేరు ఇతరులు వేరు అనే భేధ భావంతో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా మాత్రమే యోచన చేస్తూ, స్వార్థంతో వ్యవహరిస్తున్నారు. ఈ సత్యాన్ని ఎరుకపరుస్తూ ఏజాతికి, ఏమతానికి, ఏకులానికి, ఏదేశానికి చెందినా మానవులందరూ సోదరులే అనే విశ్వమానవ సోదరత్వాన్ని పెంపొందింప చేసేందుకు దివ్యజ్ఞాన సమాజం వంద సంవత్సరాలకు పైగా కృషి చేస్తున్నది. విశ్వమానవ సోదరభావానికి అంకురార్పణ చేయుటే దివ్యజ్ఞాన సమాజము ప్రధాన లక్ష్యం.