1907లో అవనిగడ్డ కేంద్రంగా దివితాలూకా ఏర్పడింది. మండలాలు ఏర్పడక ముందు శ్రీకాకుళం, ఘంటశాల మొదలుకొని కొన్ని గ్రామాలు దివి తాలూకాలో అవనిగడ్డ కేంద్రంగా ఉండేవి. మండల వ్యవస్థ ఏర్పడిన తరువాత అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటశాల, మొవ్వ మండలాలుగా విభజింపబడింది.
భౌగోళికంగా ఒకవైపు బంగాళాఖాతము, ఇరువైపులా కృష్ణానది తన పావన జలాలతో పునీతం చేస్తున్న భూమి దివిసీమ. అనగా ధరణికోట, కొల్లేరులవలె ఒకప్పుడిది సహజంగా ఏర్పడిన జలదుర్గం. ఇది క్రీస్తుకు పూర్వమే ఉద్భవించింది. శాలంకాయనులు, బృహత్పలాయనులు, విష్ణుకుండినులు, చోళులు, కాకతీయులు దండయాత్రలు గావించి దీనిని పాలించినట్లు తెలియుచున్నది. బృహత్పలాయనులకు చెందిన శాసనాల్ని బట్టి దివిసీమలోని కోడూరు ఆనాటికే జలదుర్గంగా ప్రాముఖ్యముందినట్లు తెలుస్తున్నది. అనంతర కాలంలో ఇది ''దివిదుర్గం''గా పేర్కొనబడింది. శాతవాహనుల అనంతరం ''కూడూరుహర''మనే పేరుతో 'జయవర్మ' అను బృహత్పలాయనుల రాజు దీనిని రాజధానిగా పాలించాడు. తరువాత తొమ్మిదవ శతాబ్దపు చివరికాలంలో దివిసీమను అయ్యవంశీయులు 'పెదదీవిపురాన్ని' అనగా నేటి 'తలగడదీవి' రాజధానిగా చేసుకొని పాలించారు...
పేజీలు : 176