అప్పటికే దేశవ్యాపితంగా స్వాతంత్య్ర పోరాటం ముమ్మరంగా సాగుతున్న తరుణంలో బ్రిటీష్ ప్రభుత్వం ప్రజల సహాయ నిరాకరణ తిరుగుబాటుతో ఉక్కిరిబిక్కిరై దేశానికి స్వాతంత్య్రం ప్రకటించి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని, హిందూ, ముస్లింలమధ్య చిచ్చుపెట్టి భారత్, పాకిస్తాన్‌లుగా విడగొట్టింది. దేశంలోని సంస్ధానాలు తమ ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకోవచ్చని ప్రకటించింది. దీనితో నిజాం నవాబుకు మరింత బలం చేకూరింది. 1947 జూన్‌లోనే హైదరాబాద్ సంస్ధానాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. ఆగష్టు 15, 1947న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. నిజాం నవాబు విలీనం చేయడానికి నిరాకరించడంతో ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుపార్టీ, ట్రేడ్ యూనియన్లు రావి నారాయణరెడ్డి, బద్ధం ఎల్లారెడ్డి, మఖ్ధుం మొహిద్దీన్ పేరుతో నిజాంను గద్దెదించేందుకు సంఘాలు పెట్టుకొని సంఘటితం కావాలని, వేరే మార్గం లేదని సెప్టెంబర్ 11న నిజాం నవాబు రాజ్యాన్ని సాయుధ పోరాటం ద్వారానే అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపు ప్రభావితమైంది. ఊరు, వాడా ఉప్పెనై కదిలింది. భూములు ఆక్రమించే పోరాటం ఉధృతమైంది. అయ్యా నీబాంచెను అనే చేతులే బందూకులు పట్టాయి. దొరల కబందహస్తాల క్రింద నలిగిన మహిళలంతా వడిసెల్లు, కారంపొడి, కర్రలు పట్టారు. తెలంగాణమంత రణరంగంగా మారింది. ఆనాటి ¬ంశాఖామాత్యులు వల్లభాయ్‌పటేల్ ఆదేశాలతో యూనియన్ సైన్యాలు హైదరాబాద్‌కు సెప్టెంబర్ 13న చేరుకోవడం, ఎలాంటి రక్తపాతం లేకుండా 17 సెప్టెంబర్న నిజాం సైన్యాలు యూనియన్‌కి లొంగిపోవడం, నిజాం నవాబు తెలంగాణ సంస్ధానాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించడంతో రాచరిక వ్యవస్ధ అంతమైపోయింది. అప్పటికే తెలంగాణలో దాదాపు 4000 మంది విప్లవ యువకిషోరాలు పోరాటంలో ఆశువులు బాసారు. |